రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ రోజే ప్రగతి భవన్లో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులతో పాటు 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరు కానున్నారు. ఇదే రోజు జాతీయ పార్టీపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనిపై అంతటా ఆసక్తి నెలకొంది.
జాతీయ రాజకీయాలపై ఇప్పటికే క్లారిటీతో ఉన్న సీఎం కేసీఆర్ వరుసగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం కూడా ఖరారైంది. దసరా రోజైన బుధవారం కొత్త పార్టీని స్థాపించనున్నారు. పార్టీకి అనేక పేర్లు పరిశీలనలోకి వచ్చినా ముందుగా ప్రచారం జరిగినట్లుగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అనే నామకరణం చేయనున్నారు.
నూతన జాతీయ పార్టీ ఏర్పాటుపై ముమ్మర ఏర్పాట్లు జరుగుతోన్నాయి.
దసరా రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. అదే రోజు ఢిల్లీలో తాత్కాలిక పార్టీ ఆఫీసును కూడా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో పార్టీ కార్యాలయం సిద్ధమవుతోంది.
ఈ మేరకు పార్టీ ఏర్పాటు, కార్యాలయ పనులను పర్యవేక్షించేందుకు కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు.
జాతీయ పార్టీ ఏర్పాటు కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మాజీ సీఎంలు కుమార స్వామి, శంకర్ సింగ్ వాఘేలా, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తదితరులు పాల్గొనే అవకాశముంది. అదే విధంగా పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్ల నియామకంపై కూడా కసరత్తు చేస్తున్నారు. అయితే నటుడు ప్రకాశ్ రాజ్ కు దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.