రచ్చబండ : ఏక్ నాథ్ షిండేకు సీఎం కేసీఆరే గాడ్ ఫాదర్ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎనముల రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, టీపీసీసీ సీనియర్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ జువ్వాది నర్సింగరావు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏక్ నాథ్ షిండేల ఉత్పత్తిని ప్రారంభించింది కేసీఆరేనని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని మంత్రిని చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి రూపంలో ఏక్ నాథ్ షిండేలను తయారు చేసింది ఆయనే అని ఆరోపించారు.
ఈ తరుణంలో కేసీఆర్కు షిండేల భూతం పట్టుకుందని అన్నారు. అసలు టీఆర్ఎస్ లో ఉన్నవారంతా ఇతర పార్టీల నేతలేనని అన్నారు. అకాల వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల చేపడుతుందని అన్నారు. ఈ విషయాన్ని గాలికొదిలేసిన సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లతో కాలక్షేమం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రతి నాయకుడికి ప్రతిరూపమైన దుర్యోధనుడు, దుశ్వాసనుడిలా కేసీఆర్ ప్రవర్తన ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కు ధుర్యోదనుడు పూనినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ మాటల్లో కొత్తేం లేదు, వింతేం లేదని అన్నారు. కేంద్రం ఆదేశాల ప్రకారమే కేసీఆర్ మాట్లాడారని అన్నారు. ఆయన తన గురించి గొప్పలు చెప్పుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. కేసీఆర్ చేస్తున్నదానికి చెప్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా అని రేవంత్ ప్రశ్నించారు.
కేసీఆర్ చెప్పింది నిజమేనని, మోడీ వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు ఉందని రేవంత్ విమర్శించారు. కానీ మోడీకి కేసీఆరే గురువని అన్నారు. వంద ఎలుకలను తిన్న పిల్లి నీతి వ్యాఖ్యాలు చెప్పినట్లు కేసీఆర్ వంద తప్పులు చేసి ఇప్పుడు నీతి వాఖ్యాలు వల్లిస్తున్నారని ఆరోపించారు.
ఈ దేశంలో సాగు, తాగు నీరు అందించింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ అన్నారు. చైనా కంటే అద్భుతమైన ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కట్టినట్లు వివరించారు. కాంగ్రెస్ తో పోల్చే స్థాయి ప్రధాని మోదీకి లేదన్నారు.
పార్లమెంటులో బీజేపీ బిల్లులకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. బీజేపీ తప్పిదాలలో టీఆర్ఎస్ పాత్ర కూడా ఉందని చెప్పారు. అసెంబ్లీలో బీజేపీ తప్పిదాలను ఎత్తిచూపిన భట్టిని మాట్లాడకుండా చేసింది టీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. మోడీ దోపిడీలో కేసీఆర్ వాటా ఎంతో తేల్చాలని అన్నారు.
ఫిరాయింపుల భూతాన్ని బంధించేందుకు రాజీవ్ గాంధీ, వాజ్ పేయి కృషి చేశారని, కానీ మోడీ, కేసీఆర్ లు ఫిరాయింపులే ఎజెండాగా పని చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. మెడీని విమర్శించినంత మాత్రాలన కేసీఆర్ పునీతుడవుతాడా అని అన్నారు.
సీఎం కేసీఆర్ కు మానవ సంబంధాలు లేవని, కేవలం ఆర్థిక సంబంధాలేనని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యన ఆకు రౌడీ, గల్లీ రౌడీ పంచాయతీ మాదిరిగా జరుగుతుందన్నారు.
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే కుటుంబానికి వచ్చిన పరిస్థితే.. కేసీఆర్ కుటుంబానికి వస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. శ్రీలంక పరిణామాలతో కేసీఆర్ భయపడుతున్నాడని అన్నారు. సహారా కుంభకోణంలో కేసీఆర్ ను బీజేపీ కాపాడుతుందని ఆరోపించారు. ఆయన అవినీతిపై విచారణకు మోడీ ఆదేశిస్తారని తాము ఆశించామని తెలిపారు.
కేసీఆర్ జాతీయ పార్టీ కాకుంటే అంతర్జాతీయ పార్టీ పెట్టుకుంటే మేమొద్దంటామా అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్
సీఎం కేసీఆర్ కు నాలుగు రోజులు గడువిస్తున్నా.. నాలుగు రోజుల్లో కేసీఆర్ తన మంత్రి వర్గాన్ని రద్దు చేసి ఎన్నికల గోదాలోకి రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ను వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ కు 90 లక్షల ఓట్లకు ఒక్క ఓటు తక్కువ పడ్డా నా పేరు మార్చుకుంటా అని స్పష్టం చేశారు.
కేసీఆర్ తన పేరు పలకడానికే భయపడుతున్నాడని రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ కు 25 సీట్లు వస్తాయని, మరో 17 సీట్లు పోటాపోటీగా ఉందని టీఆర్ఎస్ వ్యూహకర్త కేసీఆర్ కు నివేదిక ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ 32 సీట్లు గెలుస్తుందని, మరో 23 సీట్లలో గట్టి పోటీ ఇస్తుందని నివేదిక ఇచ్చారని తెలిపారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుదని, కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని ఆ నివేదికలో స్పష్టమైందని రేవంత్ అన్నారు.
ఆగస్టు 2న సిరిసిల్లలో నిరుద్యోగ సభ
ఆగస్టు 2న సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లరేషన్ సభ ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సభలో డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలిపారు. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తారని ప్రకటించారు. వరంగల్ డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ రాపిడ్ గా 3 శాతం మేర ఓట్ల శాతం పెరిగిందన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలొచ్చాయని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతకు ఉద్యోగాలు రావాలని రేవంత్ రెడ్డి అన్నారు.