దేశ రైతులకు కేసీఆర్ బంపర్ ఆఫర్.. జాతీయ రాజకీయాలపై నజర్

రచ్చబండ : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్ రావు జాతీయ రాజకీయాలపై మరో ముందడుగు వేశారు. దేశ రాజకీయాలపై ఆయన స్పష్టమైన వైఖరితో ఉన్నారు. వెనక్కి తగ్గేదే లేదంటూ ఢంకా భజాయిస్తున్నారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యమంటూ ప్రతిన బూనారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొని, అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

2024 సాధారణ ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు తథ్యమని జోస్యం చెప్పారు. 28 రాష్ట్రాల రైతులు తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరారని చెప్పారు. మరి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్దామా అంటూ ప్రజలనే అడిగారు.

త్వరలోనే నిజామాబాద్ వేదికగా జాతీయ రాజకీయాల్లోకి తాను వెళ్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక్కసారి దేశం దెబ్బతింటే వందేళ్లైనా బాగుపడదని, అందుకే ప్రజాస్వామ్య పాలన కోసం మీ అందరి ఆశీస్సులతో తాను వెళ్తానని ప్రకటించారు. దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని అన్నారు.

తాము గెలిస్తే దేశంలోని రైతులందరికీ 24 గంటల పాటు ఉచిత కరెంటు సదుపాయాన్ని కల్పిస్తామని కేసీఆర్ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. దీనిపై ప్రజలందరూ ఆలోచించాలని హితవు పలికారు. వ్యవసాయానికి ప్రధాని మోడీ మీటర్లు పెట్టాలని అంటున్నారని, మీటర్లు పెట్టమన్నోడికే మీటర్లు పెట్టాలని కేసీఆర్ ధ్వజమెత్తారు.