కేసీఆర్ దూకుడు!

– జనగామ సభలో శంఖారావం
– కేంద్రంతో అమీతుమీకి సిద్ధం
– ఘాటైన పదజాలంతో బీజేపీపై ధ్వజం
– జాతీయ రాజకీయాల్లోకి వస్తామని స్పష్టీకరణ
– ఢిల్లీ పెద్దలపై గర్జన
ఢిల్లీకి వస్తా.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాం.. ఢిల్లీ కోటలు బద్దలు కొట్టేందుకు మేం సిద్ధం.. మోడీని దేశం నుంచే తరిమేస్తాం.. అన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా కేంద్రంలో తాజాగా చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆయనలోని కీలక మార్పును సూచిస్తున్నాయి.

 

హైదరాబాద్ : గత ఎన్నికలకు ముందే బీజీపీతో ఆయన వైరం పెంచుకున్నారు. ఆనాడు కూడా ఇదే విధంగా జాతీయ రాజకీయాల్లోకి వస్తానన్న కేసీఆర్ ఆ తర్మాత ఆ నిర్ణయాన్ని అటకెక్కించారు. కానీ ఇటీవల బీజేపీ, టీఆర్ఎస్ నడుమ ఘర్షణ వాతావరణమే నెలకొంది. ఇక వైరివర్గాలు అమీతుమీకే సిద్ధమయ్యాయి. ఈ దశలో కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతోంది.

తప్పని ఎదురుదెబ్బ
రాష్ట్రంలో ఎదురేలేదనుకున్న టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల జరిగిన కొన్ని ఎన్నికల్లో కొన్నిచోట్ల ఎదురుదెబ్బలు తప్పలేదు. గెలిచిన మరికొన్ని చోట్ల కూడా ఆశించిన రీతిలో ఫలితాలు రాలేదని ఆ పార్టీ నేతల్లోనే అసంతృప్తి నెలకొంది.

దళితబంధు తంటా!
దళితులకు మూడెకరాలు, దళిత ముఖ్యమంత్రిని కేసీఆర్ విస్మరించారన్న అపవాదును మరువక ముందే దళితబంధు పేరిట మరో వంచనకు దిగారని దళితులు అసహనంతో ఉన్నారు. నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఇచ్చుకుంటూ పోతే ఇప్పట్లో అయ్యే పనికాదంటూ పెదవి విరుస్తున్నారు. తమకెందుకు బంధు ఇవ్వరంటూ బీసీ, మైనార్టీతో పాటు ఇంకొన్ని వర్గాలూ అసంతృప్తిగా ఉన్నాయి.

నిరుద్యోగుల్లో అసహనం
ఉద్యోగాల భర్తీ లేదని, ఇస్తానన్న భృతి ఇవ్వడం లేదని నిరుద్యోగుల్లో అసహనం రగులుతోంది. పేదల ఎంతగానే ఎదురుచూస్తున్న అత్యధిక మందికి డబుల్ ఇండ్లు అందని ద్రాక్షగానే మారాయి. ఈ దశలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని కొన్ని సర్వేలు తేల్చాయని, ఆ పార్టీ స్వయంగా చేసిన సర్వేల్లోనూ తగ్గుముఖం పట్టిందని ప్రచారం జరిగింది.

ప్రశాంత్ కిషోర్ వ్యూహమేనా?
ఇక లాభం లేదనుకున్న సీఎం కేసీఆర్ ప్రముఖ ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపారని తెలిసింది. ఆయన ప్రణాళికలో భాగంగానే కేసీఆర్ కదలికలు మొదలయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ దశలో జనగాం జిల్లా కేంద్రంలో జరిగిన సభలో కేంద్రంలోని బీజేపీపై హుంకారానికి దారి తీసిందని వారు భావిస్తున్నారు. ఇక నుంచి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు అనుగుణంగా కేసీఆర్ నడుచుకుంటారని విశ్లేషకులతో పాటు రాజకీయ వర్గాలూ భావిస్తున్నాయి.

స్వరం పెంచిన కేసీఆర్
అయితే గతకొంతకాలంగా బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్ తాజాగా స్వరం పెంచారు. మరింత దూకుడుగా ఘాటైన పదజాలం వాడారు.

జాగ్రత్త నరేంద్రమోదీ.. ఇది తెలంగాణ పులిబిడ్డ.. బీజేపీ బిడ్డల్లారా మమ్మల్ని ముట్టుకుంటే నశ్యం చేస్తాం.. మేం ఊదితే అడ్రస్ లేకుండా పోతారు.. అంటూ అసహనంతో కూడిన ఘాటైన వ్యాఖ్యలు బీజేపీతో జాతీయస్థాయిలోనే కొట్లాడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

త్వరలో కేటీఆర్ కు పట్టాభిషేకం?
ఈదశలో ఎన్నికలకు ముందే సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో పలుమార్లు ఈ చర్చ వచ్చినా అది అమలు కాలేదు. కానీ ఈ మారు జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకే కేసీఆర్ మొగ్గు చూపనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జట్టు కడతారా? పార్టీ పెడతారా?
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి జట్టు కడతారా.. లేక ఏదైనా జాతీయ పార్టీ పెట్టి ముందుకెళ్తారా.. అన్న చర్చకు తెరలేసింది. గతంలో కూడా జాతీయ పార్టీ పెట్టనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

తాజా పరిణామాలతో ఆయన అడుగులు వడివడిగా పడుతున్నట్లు అర్ధమవుతోంది. మరి ఏం జరుగుతుందో.. కొద్దికాలంలోనే తేలిపోనుంది.