ఈ చెప్పుల వరుస ఎందుకో తెలుసా!

చెప్పుల జోళ్లు.. వరుసగా పెట్టిందెవరో తెలుసా.. ఎల్లకాలం.. రెండు కార్లు.. రెక్కల కష్టం.. నమ్ముకొని.. దగా అవుతూనే కాలం వెళ్లదీస్తున్న అన్నదాతలు.. యాసంగి పంటలకు యూరియా కోసం ఇలా తంటాలు పడాల్సి వస్తోంది.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో శనివారం కనిపించిన ఈ దీనస్థితి రైతులకు ఎదురైంది. యూరియా కొరత కారణంగా అక్కడి సొసైటీ కార్యాలయానికి వచ్చి ఇలా చెప్పులు వరుసగా పెట్టి ఎదురు చూడసాగారు. తెల్లవారుజామున 6 గంటల నుంచే ఇలా రైతులు పడిగాపులు పడిన దుస్థితి నెలకొంది. గంటలకొద్దీ నిలబడలేక రైతున్నలు ఇలా క్యూలో పెట్టారు.

ఆరుగాలం పంటలు పండించడం ఒక ఎత్తు.. వాటిని కాపాడుకోవడం మరో ఎత్తు.. పంటలను అమ్ముకునే బాధలు వర్ణనాతీతం. పంట పండే దశలో ఎరువులు దొరక్క ఇలాంటి బాధలు పడటం రైతులకే ఎదురవుతోంది. ఇలా యూరియా కోసం గంటలకొలది ఎదురుచూసినా దొరుకుతుందో.. లేదోనన్న బెంగలేకపోలేదు.