Jai Sriram.. శంకర్ పల్లిలో శ్రీరాముని ఫ్లెక్సీల తొలగింపు.. చెత్త బండిలో పడేసిన మున్సిపల్ సిబ్బంది

Jai Sriram.. శంకర్ పల్లిలో శ్రీరాముని ఫ్లెక్సీల తొలగింపు.. చెత్త బండిలో పడేసిన మున్సిపల్ సిబ్బంది
* పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తీరుపై స్థానిక నేతల ఆగ్రహం
* శంకర్ పల్లి చౌరస్తాలో హిందూవాహిని ఆధ్వర్యంలో నిరసన
* రోడ్డుపై బైఠాయింపు.. వాహనాల రాకపోకులకు అంతరాయం

రచ్చబండ, శంకర్ పల్లి: అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈనెల 22వ తేదీ నాడు స్థానిక హిందూవాహిని కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు పట్టణంలో కట్టిన కాషాయ తోరణాలు, శ్రీరాముని చిత్రపటాలు, జెండాలను గురువారం పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించడంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. హిందూవాహిని కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో నిరసనకు దిగారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో సుమారు 45 నిమిషాలపాటు హైదరాబాద్, సంగారెడ్డి, చేవెళ్ల రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో స్థానిక పోలీసులు, మున్సిపల్ పరిశుధ్య సిబ్బంది వ్యవహరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన పురస్కరించుకొని పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్లపై వేసిన కాషాయ తోరణాలు, శ్రీరాముని చిత్రపటాలు, జెండాలు ఏర్పాటు చేశామన్నారు. కాగా వాటిని నిర్దాక్షిణ్యంగా పారిశుధ్య సిబ్బంది ట్రాలీలో వేసుకొని మున్సిపల్ కార్యాలయంలో తరలించడం బాధాకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు చూడాలని వారు డిమాండ్ చేశారు.