ఆయననే వరించనున్న కేంద్ర మంత్రి పదవి? ఉత్కంఠకు త్వరలో తెర!

రచ్చబండ : తెలంగాణకు చెందిన మరో నేతకు కేంద్ర మంత్రి పదవి వరించనుందా.. ఇప్పటికే కేంద్రం సంకేతాలిచ్చిందా.. అందుకే ఆ నేత మీడియాకు దూరంగా ఉన్నారా.. అంటే అవుననే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

తెలంగాణలో అధికారమే పరమావధిగా అడుగులు వేస్తున్న బీజేపీ అధిష్ఠానం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేంద్ర మంత్రి వర్గంలో సీనియర్ నేత కిషన్ రెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. త్వరలో తెలంగాణకు చెందిన మరో నేతకు మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశముందని సమాచారం.

తెలంగాణ నుంచి బండి సంజయ్ కుమార్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్ లోక్ సభ సభ్యులుగా, కే.లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వీరిలో ఒక్కరికే కేంద్ర మంత్రి పదవికి తీసుకునే అవకాశముంది.

ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి మంత్రిగా కొనసాగుతుండగా, ఈ సారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి దక్కొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే బాపూరావు మినహా మిగతా ముగ్గురు ఎంపీలూ బీసీలే కావడం గమనార్హం.

ఎంపీల్లో బండి సంజయ్ కుమార్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మంచి మార్కులే ఉన్నాయి. ఈ దశలో ఆయనను ఆ పదవి నుంచి మార్చే యోచన చేయకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా కే.లక్ష్మణ్ సీనియారిటీని గుర్తించిన పార్టీ యూపీ నుంచి రాజ్యసభకు పంపి, వెంటనే పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించింది.

ఈ దశలో ధర్మపురి అరవింద్ వైపే బీజేపీ అధిష్ఠానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించినందుకు అధిష్ఠానం వద్ద ఆయనకు గుర్తింపు ఉంది. అయితే ఆయన పలు విషయాల్లో ముక్కుసూటిగా వ్యవహహరిస్తూ ఉంటారు. ఇటీవల ఆయన పలు అంశాల్లో సైలెంట్ గా ఉంటున్నారు.

ఎమ్మెల్సీ కవితపై తాజాగా వచ్చిన మద్యం కుంభకోణం ఆరోపణలపై, ఇతర కొన్ని సున్నిత అంశాలపైనా అరవింద్ కొంత సంయమనంతో ఉన్నారు. మంత్రి పదవి ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని, పెద్దల సలహా మేరకే ఆయన ఈ వైఖరి అవలంబిస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా ధర్మపురి అరవింద్ త్వరలో కేంద్ర మంత్రి కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.