నా సొంత భూమిలో అక్రమంగా రోడ్డు వేశారు

నా సొంత భూమిలో అక్రమంగా రోడ్డు వేశారు

* అధికారులు న్యాయం చేయాలి
* కంట్రీ సైడ్ వెంచర్ యజమాని మసూద్

రచ్చబండ, శంకర్ పల్లి: తన భూమిలో నుంచి అక్రమంగా రోడ్డు వేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కంట్రీ సైడ్ వెంచర్ యజమాని మసూద్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని మణిదీపిక గార్డెన్ లో శనివారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను 2007 సంవత్సరంలో మోకిల గ్రామంలోని సర్వేనెంబర్ 98, 99లో19.20 ఎకరాల భూమిని కొనుగోలు చేశానని తెలిపారు. 2007లోనే డిటిసిపి కోసం దరఖాస్తు చేయగా ఎల్ పి నెంబర్ వచ్చిందని చెప్పారు.

 

హెచ్ఎండీఏ పరిధిలోకి ఈ భూమి వచ్చిందని ఎల్ పి నంబర్ ( డిటిసిపి)ను సైతం 2010-11 సంవత్సరంలో అధికారులు రద్దు చేశారని స్పష్టం చేశారు. 2018 సంవత్సరంలో ఓ వెంచర్ వాళ్లు తన భూమిలో నుంచి రోడ్డు వేయడానికి రాగా తాను అడ్డుకున్నానని చెప్పారు. 2020 జూన్ 6న కలెక్టర్ ఇచ్చిన మెమో ఆధారంగా అప్పటి డిపిఓ, డిఎల్పిఓ, పంచాయతీ కార్యదర్శులు తన భూమి వద్దకు రాగా, ఆ వెంచర్ వాళ్ళు అక్రమంగా రోడ్డు వేశారని ఆవేదన చెందారు. కలెక్టర్ ఇచ్చిన మేమోలో ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగించాలని ఉండగా, దాన్ని ఆధారంగా చేసుకొని ఏకంగా రోడ్డే వేశారని అన్నారు.

కలెక్టర్ ఇచ్చిన మెమోలో సైతం 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ను అనుసరించాల్సి ఉండగా, 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ను పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. అక్రమంగా రోడ్డు వేసిన వారిపై కలెక్టర్ తో పాటుగా పోలీస్ కమిషనర్ కు గతంలో ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అయితే డిటిసిపి లే అవుట్ ఎల్పి నెంబర్ గురించి తాను హెచ్ఎండిఏ, డిటిసిపి, కలెక్టర్ లకు సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేయగా, డిటిసిపి ఎల్పీ నంబర్ రద్దయిన విషయాన్ని వారు స్పష్టంగా తనకు సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. తన భూమిలో అక్రమంగా రోడ్డు వేశారనే విషయాన్ని ప్రస్తుత కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు.

తానిచ్చిన ఫిర్యాదు కలెక్టర్ పరిశీలనలో ఉందని, కలెక్టర్ త్వరగా నిర్ణయం తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ ఆయన వేడుకున్నారు. తాను మైనారిటీ అయినందునే 2020 సంవత్సరంలో అక్రమంగా పోలీసులు, అధికారుల సహకారంతో తన భూమిలో నుంచి రోడ్డు వేశారని ఆయన వివరించారు. అక్రమంగా రోడ్డు వేస్తుండగా తాను అడ్డుకుంటే పోలీసులు తప్పుడు కేసు పెట్టారని అన్నారు. అక్రమంగా రోడ్డు వేసిన విషయం గురించి తాను హైకోర్టుకు వెళ్ళగా సింగిల్ బెంచ్ న్యాయమూర్తి తనకు అనుకూలంగా తీర్పు ఇస్తూ, అధికారులను తప్పుపట్టారని తెలిపారు.

స్థానిక రాజకీయ నాయకులతో పాటుగా, రౌడీ షీటర్లు, గుర్తుతెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన విలేకరుల ముందు వాపోయారు. హెచ్ఎండిఏ అధికారులు ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండా దారిలేని విల్లాలకు అనుమతులు ఇవ్వడమేంటంటూ ఆయన ప్రశ్నించారు. ఆ వెంచర్ లోని యజమానులు తనను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిలో అక్రమంగా రోడ్డు వేయడంతో సుమారుగా 1.20 ఎకరాలకు పైగా భూమి కోల్పోవాల్సి వస్తుందని అధికారులే తనకు న్యాయం చేయాలంటూ ఆయన వేడుకున్నారు.