హైదరాబాద్ నజర్.. బాలానగర్‌ ఫ్లై ఓవర్‌

  • రేపు మంత్రి కేటీఆర్ చే ప్రారంభం

హైదరాబాద్‌ : నగర పరిధిలోని బాలానగర్‌ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని మంగళవారం రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. ప్రారంభానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మూడున్నరేళ్ల పాటు నిర్మాణ పనులు జరిగిన ఈ బ్రిడ్జి హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారల్లో ఇదొకటి. బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు కాగా, 24 మీటర్లు వెడల్పు 26 పిల్లర్లతో నిర్మించారు.

బాలానగర్ డివిజన్‌లోని నర్సాపూర్‌ చౌరస్తా రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి. కూకట్‌పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే రహదారి. పారిశ్రామిక కేంద్రం కావడంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. బాలానగర్‌లో ట్రాఫిక్‌ దాటాలంటే కష్టంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలకు ఇక్కడ ట్రాఫిక్‌ కష్టాలకు పరిష్కారం చూపేందుకే బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించారు. రయ్‌ రయ్యున బాలానగర్‌పై ఓవర్‌ బ్రిడ్జిపై వాహనాలు పరుగులు తీయడానికి అంతా సిద్ధం చేశారు.

సాకారమిలా..

బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి 2017 ఆగస్టు 21న మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.385 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేశారు. బ్రిడ్జి ఇరువైపులా రెండు డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్‌. రెండు డివిజన్ల పరిధిలో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. హైదరాబాద్‌ నగరంలోని అతి ప్రధాన రహదారుల్లో ఇదొకటి కావడం విశేషం. 6 లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి ఇది. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేపట్టారు. దీనికి బాబూ జగజ్జీవన్‌రామ్‌ బ్రిడ్జిగా నామకరణం చేయనున్నారు.