ప్రముఖ సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సినీ నిర్మాతగా మారనున్నారు. ఇప్పటికే నిర్మించే సినిమాలపై ఓ క్లారిటీకి వచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి సంయుక్తంగా సినిమాలను నిర్మించనున్నారు. మెగా హీరోలతో పాటు బయటి హీరోలతోనూ సినిమాలు చేయనున్నట్లు సమాచారం. సుమారు 15 సినిమాలు నిర్మించనున్నట్లు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వాటిలో 3 భారీ బడ్జెట్ సినిమాలతో పాటు 6 మధ్యతరహా, మరో 6 లోబడ్జెట్ సినిమాలు ఉంటాయట.
రామ్ చరణ్ తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నారు. అదే విధంగా సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తోనూ సినిమాలు నిర్మించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కోసం బల్లెం తిప్పే శిక్షణలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అటు రాజకీయవేత్తగా, సినీ హీరోగా ఉంటూ మరో వైపు నిర్మాతగా కొనసాగనున్నారన్నమాట.