- మోకిలా పీఏసీఎస్ చైర్మన్ గోపాల్
రచ్చబండ, శంకర్ పల్లి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా పీఏసీఎస్ చైర్మన్ ఎలిమెల గోపాల్ అన్నారు. గురువారం మోకిలా గ్రామ శివారులోని రైతు వేదిక వద్ద మోకిల పీఏసీఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ వారి వద్ద పండించిన పంట నమోదు వివరాలతో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి రావాలని సూచించారు. 17% తేమ ఉండేలా వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించాలని తెలిపారు.
శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజు నాయక్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ వారు రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. వారు ప్రతి సంవత్సరం పండించిన పంటల వివరాలను సేకరించి రైతులకు సహకరించాలని కోరారు. మండల వ్యవసాయ శాఖ అధికారి సురేష్ బాబు మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా చూసుకుంటామని తెలిపారు.
పండించిన పంట వివరాలను ఏఈఓ లకు వివరించి పండించిన పంట నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య, సర్పంచ్ సుమిత్ర మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సరిత రాజు నాయక్, మాజీ సర్పంచ్ ఆనంద్, మాజీ ఆప్షన్ సభ్యుడు ఖాదర్ పాషా, పిఎసిఎస్ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు.