జర్నలిజంలో డాక్టర్ బంటు కృష్ణకు గోల్డ్ మెడల్

జర్నలిజంలో డాక్టర్ బంటు కృష్ణకు గోల్డ్ మెడల్
* గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్ డి పట్టా, గోల్డ్ మెడల్ అందుకున్న సూర్యాపేట జిల్లా వాసి
* 2016-17లో పీహెచ్డీలో యూనివర్సిటీ టాపర్ గా నిలవడంతో దక్కిన బంగారు పతకం
* జన్మనిచ్చిన అమ్మా, నాన్నకు, స్ఫూర్తినిచ్చిన అంబేద్కర్ కు ఈ ఘనత అంకితం: కృష్ణ

హైదరాబాద్, రచ్చబండ: సూర్యాపేటకు చెందిన సీనియర్ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ జర్నలిజంలో గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో బుధవారం జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై చేతుల మీదుగా జర్నలిజం విభాగంలో పీహెచ్ డీ పట్టా, గోల్డ్ మెడల్ అందుకున్నారు. ‘తెలుగు న్యూస్ చానల్స్ లో ఉదయం ప్రసారమయ్యే రాజకీయ చర్చలు – ఒక అధ్యయనం’ అన్న టాపిక్ పై బంటు కృష్ణ పరిశోధన పూర్తి చేశారు. 2016-17 సంవత్సరానికి గాను పిహెచ్ డి జర్నలిజం విభాగంలో యూనివర్సిటీ టాపర్ గా నిలవడంతో కృష్ణను గోల్డ్ మెడల్ వరించింది.

తనకు గోల్డ్ మెడల్ రావడానికి సహకరించిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ తంగేడ కిషన్ రావు కు, రిజిస్ట్రారు ఆచార్య బట్టు రమేష్ కుమార్ కు, గైడ్ కడియాల సుధీర్ కుమార్ కు విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి, మిత్రులు, బంధువులకు ఈ సందర్భంగా బంటు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తాను సాధించిన ఈ ఘనతను జన్మనిచ్చిన అమ్మ అయ్యకు, సమీకరించు బోధించు, పోరాడు అన్న భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అంకితమిస్తున్నట్టు చెప్పారు.

ప్రతివారు కూడా కుల, మత, వర్గ, వర్ణ రహిత సమాజం కోసం, తోటి మనిషిని మనిషిగా చూసే అంతరాల దొంతరలు లేని మానవత్వపు పరిమళాలు విరాజిల్లే సమానత్వ జీవితం కోసం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి కృషి చేయాలని, కేవలం విద్య ద్వారానే అన్ని సాధ్యమవుతాయని, చనిపోతే వెంటరాని ఆస్తుల కన్నా బతికినన్నాళ్లు తోడుగా ఉండి సహకారం, మమకారం అందించే ఆత్మీయులు, ఆప్తులను సంపాదించుకోవాలని డాక్టర్ కృష్ణ విజ్ఞప్తి చేశారు. గత 30 సంవత్సరాలుగా వివిధ పత్రికలలో పలు హోదాలలో పని చేస్తూ ఉన్న డాక్టర్ బంటు కృష్ణ కవి, రచయిత, సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కు అనుబంధం- టీయూడబ్ల్యూజే ఐజేయు) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

జర్నలిజంలో బంగారు పతకం సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సూర్యాపేట ముద్దుబిడ్డ డాక్టర్ బంటు కృష్ణను తోటి జర్నలిస్టులు, పలువురు అధికారులు, రాజకీయ నాయకులు, టియుడబ్ల్యూజే ఐజేయు నాయకులు, హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు, కవులు, రచయితలు, కార్టూనిస్టులు, యూనివర్సిటీ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, అయన స్వగ్రామమైన నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామస్తులు, క్లాస్ మేట్స్ అభినందనలు, ఆశీస్సులు శుభాకాంక్షలతో ముంచెత్తారు.