• జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి భరోసా
• బాధిత రైతులకు రూ.రెండు లక్షల విలువైన వరి విత్తనాలు ఉచితంగా పంపిణీ
రచ్చబండ, మంగపేట : గోదావరి వరద ముంపునకు గురైన అన్నదాతలు అధైర్యపడవద్దు.. వారికి అండగా నేనుంటా.. అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి భరోసా ఇచ్చారు. ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామాల్లో వికాస్ అగ్రి పౌండేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం బాధిత రైతులకు ఉచితంగా రూ.2 లక్షల విలువైన వరి విత్తనాలు అందజేశారు.
అకినేపల్లి మల్లారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ.కొత్తగూడెం గ్రామాల్లో ఇటీవల గోదావరి వరదల వల్ల వరి నారుమడులు పూర్తిగా నష్టపోయిన రైతులకు సాంబశివారెడ్డి ఈ సాయం చేశారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ వరంగల్ నగరంలోని వివిధ విత్తన సంస్థలను కలిసి గోదావరి ముంపు వల్ల జరిగిన పంట నష్టాన్ని తాను వివరించడంతో వారు స్పందించి 200 ఎకరాలకు సరిపడా సీడ్ ప్యాకెట్లను వితరణగా అందజేశారని వివరించారు.
వాస్తవంగా పంట నష్టపోయిన రైతులను గుర్తించి విత్తనాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన అన్నపూర్ణ సీడ్స్ చందుపట్ల వేణుగోపాల్ రెడ్డి, శ్రీ లక్ష్మీ సీడ్స్ ప్రతాప్ రెడ్డి, కర్షక్ సీడ్స్ వేణుగోపాల్ రెడ్డి, శ్రీ కిన్నెర సీడ్స్ జగన్మోహన్ రావు, కిన్నెర సీడ్స్ సొననబోయిన మొగిలి తదితరులకు ఆయన అభినందనలు తెలిపారు.
వారందరికీ రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వరి సాగు చేసే రైతులు లోతట్టు ముంపు ప్రాంతాల్లో కాకుండా వెంటనే మెరక ప్రాంతంలో నారు మడులు విత్తుకోవాలని సాంబశివరెడ్డి సూచించారు. నారుమడులు నష్టపోయిన రైతాంగానికి సీడ్ విత్తనాలతో పాటు నారు మడి యాజమాన్యం కోసం రూ.50,000 విలువైన సూక్ష్మ పోషక ఎరువుల కిట్లను సైతం రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు సాంబశివారెడ్డి తెలిపారు.
విత్తన ఉత్పత్తిలో మేటి గా ఉన్న ఆకినేపల్లి మల్లారం గ్రామంలో మూడు దశాబ్దాలుగా ఎప్పుడూ లేని విధంగా ఇంతటి వరద విపత్తు జరగటం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ షేక్ మదర్ సాహెబ్, రైతులు జాడీ ప్రసాద్, తొండపు సంజీవరెడ్డి, గాదె నరేందర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాజు, షేక్ మోయునుద్దేన్ తదితరులు పాల్గొన్నారు.