నరసింహ స్వామిని విష్ణుమూర్తి దశావతారాల్లో నాలుగో అవతారంగా కొలుస్తారు. నరసింహస్వామి కొలువైన ఆలయాలు ఎన్నో ఉన్నా.. తొమ్మిది ఆలయాల్లో స్వామివారు స్వయంభువుగా వెలిసినట్లు భక్తులు నమ్ముతారు. ఆయా ఆలయాలే అత్యధిక ప్రాచుర్యం పొందాయి. అవి మహిమాన్విత క్షేత్రాలుగా భక్తుల నుంచి నిత్యపూజలు అందుకుంటున్నాయి.
అహోబిలం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు సమీపంలో ఉన్న అహోబిలం నవ నారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనది. విష్ణుమూర్తి ఉగ్ర నరసంహుడై హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన స్థలం ఇదేనని ప్రశస్తి. ఆ దృశ్యాన్ని చూసిన సకల దేవతలు ఆశ్యర్యంతో ‘అహో.. బలం’ అని కొనియాడారట. దాని నుంచే అహోబిలం పేరున వాడుకలోకి వచ్చిందని నానుడి.
శ్రీ మహా విష్ణువు ఉగ్ర నారసింహ అవతారంలో ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్ని ఇక్కడ చూడవచ్చు. హిరణ్య కశిపుని సంహరించిన అనంతరం సమీప కొండల్లో తిరుగుతూ జ్వాలా, అహోబిల, మాలోల, వరాహ, కారంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నరసింహ స్వామి రూపాల్లో తొమ్మది చోట్ల వెలిశాడని ప్రతీతి. అందుకే దీనిని నవ నారసింహ క్షేత్రంగా గుర్తింపు పొందింది.
అంతర్వేది :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేదిలో నరసింహస్వామి ఆలయం ఉంది. త్రేతాయుగంలో బ్రహ్మ హత్యా మహాపాతకం నుంచి విముక్తిని పొందడానికి రావణబ్రహ్మను సంహరించిన శ్రీరాముడు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు పురాణాల్లో ఉంది. హిరణ్య కశిపుని కుమారుడైన రక్తావలోచనుని సంహరించిన తర్వాత వశిష్ట మహర్షి కోరిక మేరకు శ్రీ విష్ణుమూర్తి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిగా వెలిశాడనేది పురాణ గాథ. వశిష్టడు ఇక్కడ యాగం చేసినందు వల్లే దీనికి అంతర్వేది అనే పేరొచ్చిందని అంటారు. ఇక్కడి విగ్రహాలను బట్టి క్రీ.శ. 300 సంవత్సరానికి ముందే నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రంలో మాఘమాసంలో స్వామి, అమ్మవారి కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
మాల్యాద్రి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్న మరో నారసింహ క్షేత్రమిది. ప్రకాశం జిల్లా కందుకూరు- పామూరు రోడ్డులోని వలేటివారి పాలెం సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. ఆగస్త్య మహా ముని మాల్యాద్రి మీద తపస్సు చేయగా లక్ష్మీ నారసింహుడు జ్వాలా రూపుడై దర్శనమిచ్చాడని పురాణ గాథ. ఇక్కడి కొండ పూలమాల ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరొచ్చిందని అంటారు. ఇక్కడి స్వామివారిని భక్తులు కేవలం శనివారం మాత్రమే దర్శించుకుంటారు. మిగతా ఆరు రోజులు దేవతలూ, రుషుల దర్శనార్థం కేటాయించాలని కోరగా స్వామి సమ్మతించాడని అంటారు.
విచిత్రమేమిటంటే మిగతా ఆరు రోజులూ ఆలయాన్ని తెరవాలని ఎందరో ప్రయత్నించారని, వారంతా పలు ఇబ్బందులు గురయ్యారని చెప్తుంటారు. దీంతో మిగతా ఆరు రోజుల్లో ఆలయ సమీపంలోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. శుక్రవారం రాత్రి పూటే అర్చకులు, సిబ్బంది మాల్యాద్రికి చేరుకొని ఉదయాన్నే పూజలు నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి ఆలయం తలుపులు మూసేసి వెళ్లిపోతారు.
ధర్మపురి :
ధర్మపురికి వెళితే యమపురి ఉండదు.. అని అంటటారు.. ఇది తెలంగాణలోని మరో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరంలో ఈ ఆలయం ఉంది. ధర్మవర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినందునే దీనికి ధర్మపురి అని వచ్చిందని, ఆయన తపస్సు చేయడం వల్లే నరసింహ స్వామి ఇక్కడ వెలిశాడని భక్తుల కథనం. పౌరాణిక గాథ ప్రకారం రాక్షసవధ జరిగిన తర్వాత స్వామి ఇక్కడే తపస్సు చేశాడని, ఆపై స్వయంభుగా వెలిశాడని, యోగానందుడికి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నాడని అంటారు.
ఇక్కడ మరో విశేషమేమిటంటే యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. ముందుగా ఆయన్ని దర్శించుకున్నాకే స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. పూర్వం యమధర్మరాజు స్వామిని దర్శించుకొని ఇక్కడే నివాసం ఏర్పర్చుకున్నాడని చెప్తారు.
మంగళగిరి :
పానకాల స్వామిగా భక్తులు పిలుచుకునే ఆలయం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఉంది. ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నాయి. కొండ కింద ఉన్న స్వామిని లక్ష్మీ నరసింహ స్వామి గానూ, కొండపైన నోరు తెరుచుకున్న ఆకారంలో ఉండే స్వామి దర్శనమిస్తారు. అక్కడి స్వామికి పానకం అంటే మహా ప్రీతి. పానకంతో అభిషేకిస్తే సగం తాగి, మిగిలిన సగాన్ని భక్తులకు ప్రసాదంగా వదులుతాడట. ఇక్కడ పానకం కింద ఒలికినా ఈగలు, చీమలు చేరకపోవడం విశేషం. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తులో ఉండే కొండ కింది ఆలయాన్ని ధరణికోట జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయకుడు కట్టించారు.
సింహాద్రి :
సింహాద్రి అప్పన్నగా భక్తులు ప్రేమతో స్వామివారిని పులుచుకునే ఆలయం విశాఖ పట్టణానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు వరాహ ముఖం, మానవాకారం, సింహపుతోకతో దర్శనమిస్తారు. ఇతర ఆలయాలకు భిన్నంగా ఇక్కడ పశ్చిమ ముఖంగా ఈ ఆలయం ఉంటుంది. తూర్పు కనుమల్లో సముద్రమట్టానికి 800 అడుగుల ఎత్తోలని కొండపైన వెలిసిన ఈ క్షేత్రాన్ని క్రీ.శ. 11వ శాతాబ్దంలో లాంగూల గజపతి నిర్మించాడని అంటారు.
స్వయంభుగా వెలిసిన స్వామివారిని మొదట ప్రహ్లాదుడు పూజించాడని అంటారు. ఆ తర్వాత చంద్రవంశానికి చెందిన పురూరవుడు ప్రయాణించే పుష్పక విమానాన్ని ఈ స్థలం ఆకర్షించిందని చెప్తుంటారు. ఏడాదిపాటు విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచుతారు. వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కల్పిస్తారు.
పెంచలకోన :
కృతయుగంలో హిరణ్యకశిపుని సంహారం అనంతరం ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి గర్జిస్తూ శేషాచల కొండల్లో సంచరించ సాగాడట. ఓ చోట చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి స్వామికి తారస పడిందట. స్వామి భీకర రూపం చూసిన చెలి కత్తెలంతా పారిపోయినా ఆమె మాత్రం అక్కడే నిలబడి ఉందట. ఆమె ధైర్య సాహసాలకు, సౌందర్యానికీ ముగ్దుడైన స్వామి శాంతించాడట.
తర్వాత ఆయన తండ్రి చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకున్నాడని ప్రతీతి. ఆమెను పెనవేసుకొని ఇక్కడే శిలాపూరంలో వెలిశాడనీ, అందుకే ఇక్కడి స్వామిని పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామిగా భక్తులు కొలుస్తారు. ఈ క్షేత్రం నెల్లూరు జిల్లా రాపూర్ మండల కేంద్రంలో ఉంది.
వేదాద్రి :
ఇది కృష్ణా జిల్లా పరిధిలోని చిల్లకల్లుకు 10 కిలోమీటర్ల దూరంలోని కృష్ణానది తీరంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు జ్వాల, సాలగ్రామ, యోగానంద, లక్ష్మీ నరసింహ, వీర నరసింహ స్వామి అవతారాల్లో దర్శనమిస్తారు. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచేయగా, శ్రీ మహా విష్ణువు మత్య్సావతారం ఎత్తి సోమకాసురుడిని సహరించి వేదాలను రక్షించాడు. అప్పడు ఆ వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరగా.. నరసింహావతారంలో ఆ కోరిక తీరుతుందని సెలవిస్తాడట. అందుకే హిరణ్య కశిపుని సంహరించిన తర్వాత స్వామివారు ఐదు అంశలతో ఇక్కడ ఆవిర్భవించినట్లు చెప్పుకుంటారు.
యాదాద్రి :
హైదరాబాద్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్టపై స్వామి వెలిసిన ఈ క్షేత్రమే నేడు యాదాద్రిగా రూపుదిద్దుకుంది. పూర్వం రుష్య శృంగుని కుమారుడైన యాదరుషి ఈ కొండపైన స్వామివారిని చూడాలని ఘోర తపస్సు చేయగా, ఉగ్ర నరసింహుడు పత్ర్యక్షమయ్యాడట. ఆ ఉగ్రరూపం చూడలేక శాంతరూపంలో కనిపించమని మళ్లీ వేడుకోగా స్వామి కరుణించి లక్ష్మీ సమేతుడై కొండపై కొలువుదీరాడట.
మళ్లీ యాదరుషి తపస్సు చేసి వేర్వేరు రూపాల్లో కనిపించాలని స్వామిని వేడుకున్నాడట. దీంతో నరసింహ స్వామి జ్వాలా, యోగానంద, గండభేరుండ, ఉగ్ర నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడని ప్రతీతి. ఉగ్రరూపం అదృశ్యంగా ఉంటుందట. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలూ నయమై పోతాయనేది భక్తుల నమ్మకం.