కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో అడుగు ముందుకేసింది. తాజా నిర్ణయంతో ఓ మార్పునకు శ్రీకారం చుట్టినట్టుగా భావిస్తున్నారు. నాడు దశాబ్దాలపాటు దేశాన్నేలిన ఆ పార్టీ నేడు కొన్ని రాష్ట్రాలకే పరిమితమై వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆధిక్యత సాధించేందుకు పట్టుదలతో ఉంది.
కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని పార్టీల్లొని కొందరు నేతలు మొదటి నుంచి కుటుంబ సభ్యులకు పదవుల పంపకాలు చేస్తూ ఉంటున్నారు. ఇప్పటికీ ఆ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. దానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తాజాగా నిర్ణయించింది.
రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ చింతన్ శిబిర్ లో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రసంగించారు. కుటుంబంలో ఒక్కరికే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని సోనియా స్పష్టం చేశారు. పార్టీ నేతలు వ్యక్తిగత స్వార్థం వీడి, జనాల్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నిర్ణయంపై హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం సమర్థిస్తున్నారు. ఈ మార్పుతో మరిన్ని ఫలితాలు వస్తాయని అంటున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశ ప్రజలు భయభయంగా బతుకుతున్నారని సోనియాగాంధీ అన్నారు. బీజేపీ మైనార్టీలను క్రూరంగా అణిచివేస్తోందని ఆమె ఘాటుగా స్పందించారు.