చిట్యాలకు మరో హంగు

• రూ.2 కోట్లతో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం
• నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన

చిట్యాల : నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో రోజురోజుకూ విస్తరిస్తోంది. ఒకదానికొకటి చొప్పున సర్వ హంగులను రూపుదిద్దుకుంటోంది. మున్సిపాలిటీగా మార్పు చెందాక అభివృద్ధిపథంలో పయనిస్తోంది. ఈ మేరకు రూ.2 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శ్రీకారం చుట్టారు.

చిట్యాల మున్సిపాలిటీలో రూ.2 కోట్లతో అన్ని హంగులతో సమీకృత మార్కెట్లను ఒకే చోట నిర్మించనున్నారు. కూరగాయలు, మాంసం, పూలు, పండ్ల దుకాణాల సముదాయాలను నిర్మించనున్నారు. దీంతో ఒకేచోట అన్నీ కొనుగోలు చేసేలా పట్టణ ప్రజలకు వెసులుబాటు కలగనుంది.

చిట్యల పట్టణంలో రెండు ఎకరాల స్థలంలో సమీకృత మార్కెట్ సముదాయాన్ని నిర్మించనున్నారు. రూ.2 కోట్ల నిధులతో చేపట్టే మార్కెట్ లో 26 కూరగాయల దుకాణాలు, 8 పూలు, పండ్ల దుకాణాలు, 14 మాంసం దుకాణాలను ఒకే సముదాయంలో నిర్మించనున్నారు.

చిట్యాలలో సమీకృత మార్కెట్ లో అధునాతన హంగులతో దుకాణ సముదాయాన్ని నిర్మించనున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. నిర్మాణ పనులను సకాలంలో చేపట్టి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే కోరారు.