కుడా చైర్మన్ గా బీసీ నేతకు పట్టం

• సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ప్రమాణ స్వీకారం

వరంగల్ : ప్రతిష్ఠాత్మక కుడా (కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ గా బీసీ నేతకు అవకాశం దక్కింది. దీంతో బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిష్ఠాత్మక పదవిని బీసీ నేతకు అప్పగించడంపై ప్రభుత్వానికి వారు అభినందనలు తెలుపుతున్నారు.

ఈ మేరకు గురువారం కుడా చైర్మన్ గా ఎన్నికైన సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ను బీసీ సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు. ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. పుష్పగుచ్ఛం అందించి, భారీ గజమాలతో సన్మానించారు.

కూడా చైర్మన్ గా సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ఆ కార్యాలయంలో గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరి రవి కృష్ణ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జి వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ నేతృత్వంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.

ఈ సందర్బంగా బీసీ నేతలు మాట్లాడుతూ కూడా చైర్మన్ పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన సుందర్ రాజ్ యాదవ్ కు ఇవ్వడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారు అభినందనలు తెలిపారు. త్వరలో చేపట్టనున్న నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జనగాం శ్రీనివాస్ గౌడ్, పులి మోహన్ గౌడ్, శ్రీపతి గోపి గౌడ్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, మోటపోతుల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.