అభినవ దాన కర్ణుడు.. సోనుసూద్

  • ఆగని సేవా కార్యక్రమాలు

ఆపద్బాంధవుడు.. అభినవ కర్ణుడు.. పరోపకారి.. రియల్ హీరో.. కనిపించే దేవుడు.. విజనరీ ఫిలాంత్రఫిస్ట్.. ఇవన్నీ ఎవరి పేర్లో మీకు అర్థమయ్యే ఉంటుంది.. వీటన్నింటికీ దేశంలో అర్హుడైన ఒకేఒక్కడు సోనూ సూద్.

ఏడాది క్రితం కరోనా రక్కసి మన దేశంలో కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో దేశంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈదశలో వలస కూలీలు నరక యాతన అనుభవించారు. ఉపాధి కోసం వలస వచ్చిన నగరాల నుంచి వారు కాలినడకన బయలుదేరి రోజుల కొద్ది నడుస్తూ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లసాగారు. ఈదశలో ఎన్నో కష్టనష్టాలు భరించసాగారు. వారిలో ఎందరో ఆకలికి అలమటిస్తూ మృత్యు కౌగిలికి చేరారు. వారి బాధలను పాలకులు కూడా తీర్చలేని దశలో సోనూ సూద్ అనే మనిషి రూపంలో ఉన్న దేవుడు నేనున్నానంటూ.. ప్రత్యక్సమయ్యాడు.

మహారాష్ట్ర నుంచి కాలినడకన సుమారు 300 మంది వలస జీవులు వెళ్లడాన్ని ప్రసార సాధనాల ద్వారా చూసి చలించిపోయాడు. కన్నీటి పర్యంతమయ్యాడు. వారికి ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా వారందరినీ కలిసి ప్రత్యేక వసతి కల్పించి, కరోనా పరీక్సలు చేయించాడు. భోజనాలు ఏర్పాటు చేసి వారి ఆకలి దప్పికలు తీర్చాడు. వెంటనే తన సొంత ఖర్చుతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయించి వారి వారి స్వస్థలాలకు పంపాడు. ఆయనే స్వయంగా వచ్చి వారికి వీడ్కోలు పలికాడు. చిరుదరహాసంతో వెళ్తూ వారంతా సోనూకు క్రుతగ్నతలు పలికారు. వారి సంతోషానికి సోనూలో ఆత్మ సంత్రుప్తి మిగలలేదు. ఇంకా తాను చేసే సాయముందని ఆనాడే గ్రహించాడు. అక్కడి నుంచి మొదలు తాజాగా సెకండ్ వేవ్ లో ఆక్సీజన్ దొరక్క జనం అసువులు బాయడాన్ని ఆపాలన్న సంకల్పంతో 4 ఆక్సీజన్ ప్లాంట్లు నెలకొల్పే యత్నం వరకు ఆయన చేయని సాయమంటూ లేదు. అడిగిన వారికి కాదనకుండా వితరణ చాటడం ఆయనకే చెల్లింది.

1973 జూలై 30న పంజాబ్ రాష్ట్రంలోని మోగ అనే పట్టణంలో సోనూ సూద్ జన్మించారు. నాగపూర్ లో ఎలక్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సోను తర్వాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసే వాడు. అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక బలపడింది. దాని కోసం నెలరోజులు శిక్సణ తీసుకున్నాడు. 1999లో ఒక తమిళ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించిన సోనూ సూద్ అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో, మరో వైపు నాటకాలలో నటించారు. తెలుగులో అరుంధతి చిత్రంలోని ఆయన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాన్ని అందుకున్నారు. సోనూకు వ్రుత్తి పరంగా నటుడైనా, ప్రవ్రుత్తి పరంగా సేవా గుణం అలవడింది.

మచ్చుకు కొన్ని సోనుసూద్ మహత్కార్యాలు

కరోనా వైరస్ విజృంభణ మొదలు నేటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. మొదట మహారాష్ట్ర వసల కూలీలను స్వస్థలాలకు పంపిన అనంతరం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు పంపించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆయన సేవలు దేశానికే పరిమితం కాలేదు. విదేశాల్లో ఉన్న వారికి కూడా ఆయన సేవలందడం విశేషం. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 1,500 మంది విద్యార్థులను స్వదేశానికి రప్పించి ఆపద్బాంధవుడు అయ్యాడు. ఆన్ లైన్ క్లాసుల సమయంలో సుమారు వేలాది మంది విద్యార్థినులకు సాయం చేశాడు. 150-ఇ రిక్సాలు ఇప్పించాడు. ఆంధ్రప్రదేశ్ లో ఓ గ్రామంలో ఓ రైతు తాను నాగలి దున్నుతూ, తన ఇద్దరు కూతుళ్లతో కాడిని లాగిస్తూ, తన భార్యతో విత్తనాలు వేయిస్తూ తీసిన వీడియో వైరల్ అయి సోనూ వద్దకు చేరింది. వెంటనే స్పందించిన ఆయన ఆ రైతు కుటుంబానికి ట్రాక్టర్ ను ఇప్పించి శభాష్ అనిపించుకున్నాడు. హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ అందించాడు. ఓ ఊరి దాహం తీర్చేందుకు సాయమందించాడు. సామాన్యులకు వైద్యసాయం అందించాలనే సత్సంకల్పంతో 1,000 పడకల ఆసుపత్రిని నెలకొల్పాడు. నువ్వే దిక్కు.. అంటూ వేడుకున్న దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎందరో అసహాయులకు ఆపన్నహస్తం అందించి ప్రాణాలు కాపాడిన ప్రాణదాత సోనూసూద్.

లాక్ డౌన్ సమయంలోనే ముంబైలో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న సుమారు 50 వేల మంది వలస కూలీలకు అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి వసతి, నిత్యం భోజనాలు ఏర్పాటు చేయించాడు. అదే విధంగా ముంబై నగరంలోని ఖరీదైన ప్రాంతమైన జుహీలోని తన 6 అంతస్థుల హోటల్ ను డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది బస చేసేందుకు సోనూ అవకాశం కల్పించడం విశేషం. వారికి అక్కడే భోజన ఏర్పాట్లు చేసేవారు. ఇలా దేశంలో వలస కార్మికులను ఆదుకునేందుకు టోల్ ప్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చారు. దాని ద్వారా లక్సలాది మందికి ఆకలి దప్పులు తీర్చి అపర దాన కర్ణుడయ్యాడు. అదే సమయంలో ఉపాధి కోల్పోయిన ఎందరో యువత కోసం ఒక యాప్ నే స్రుష్టించి స్వయం ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించేందుకు వేదికగా నిలిచారు. దీని ద్వారా ఎందరో ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందారు.

ఇటీవలే బెంగళూరులోని ఓ ఆసుప్రతిలో ఆక్సీజన్ అందక 22 మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ విషయం తెలిసిన సోనుసూద్ ఫౌండేషన్ బ్రుందం సభ్యులు గంటల వ్యవధిలోనే 15 ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో సందర్భా ల్లో ఫౌండేషన్ సభ్యులు ఎందరో ప్రాణాలకు రక్షణగా నిలిచారు.

ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ తరుణంలో ఆక్సీజన్ అందక ఎందరివో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ దశలో కూడా ఢిల్లీ, మహారాష్ట్ర, తీవ్రతను బట్టి ఇతర ప్రాంతాల్లో 4 ఆక్సీజన్ ప్లాంట్లను నెలకొల్పేందుకు సోనుసూద్ ముందుకొచ్చాడు.  కరోనా సమయంలో ప్రజలను ఆదుకునేందుకు తన ఆదాయం సరిపోక, కొంత ఆస్తిని తాకట్టు పెట్టగా వచ్చిన 10 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపడుతూ సేవా గుణంలో ఎవరూ చేరుకోనంత ఎత్తుకు ఎదిగాడు సోనూసూద్.

సాయమడిగితే కాదు.. లేదు.. అనలేను

ఇంతటి సేవా తత్పరతను చాటుకుంటున్న సోనుసూద్ ఏమంటాడో తెలుసా.. ఎవరైనా సాయం అడిగితే కాదు.. లేదు.. అనలేను.. అన్న మాటలు ఆనాటి ధాన కర్ణుడిని గుర్తుకు తెస్తున్నాయి. ఇంతటి సేవా కార్యక్రమాలు ఎలా సాధ్యమంటే తానొక్కడినే కాదని, తన చిన్ననాటి మిత్రులు, చార్టెడ్ అకౌంటెంట్ల సాయంతో చేస్తన్నా.. అని అంటాడు. చిత్తశుద్ధితో సాయం చేస్తున్న సోనుసూద్ ఫౌండేషన్ కు దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. విరాళం లెక్కలు పక్కాగా ఉండటంతో అభిమానులు, వితరణశీలురు ఎందరో తమ వితరణ చాటుకుంటూ సోనుసూద్ కు బాసటగా నిలుస్తున్నారు. తాజాగా ఆంద్రప్రదేశ్ కు చెందిన ఓ దివ్యంగురాలు తన ఐదు నెలల పింఛన్ సొమ్ము రూ.15,000 సోను సూద్ ఫౌండేషన్ కు పంపింది. ఇలా ఎందరో తమకు తోచినంత పంపుతున్నారు. ఇంతటి సేవాగుణం కలిగిన సోనుసూద్ సేవలో మనమూ భాగం పంచుకుందామా..