రచ్చబండ, శంకర్ పల్లి: మద్యం మత్తులో సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ యువకుడు నీళ్లలో మునిగి మృతి చెందిన సంఘటన శంకర్ పల్లి మండలం మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. సీఐ నరేశ్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హైదరాబాద్ లోని పురానాపూల్, రహీం పురాలో నివసిస్తున్న నలుగురు యువకులు సరదాగా శంకర్ పల్లి మండలంలోని మిర్జాగూడ గ్రామ సమీపంలో గల బావి వద్దకు వచ్చారు. కాగా ఆ నలుగురు అప్పటికే మద్యం సేవించి ఉన్నారు. అందులో ఒకరైన కృష్ణ కుమార్ శుక్ల(26) ఈత కొట్టడానికి బావిలో దిగారు.
కాగా బావిలో దిగిన కృష్ణ కుమార్ శుక్ల ఎంతకూ నీటిలో నుంచి పైకి రాకపోవడంతో వారు కంగారుపడి, మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కై చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. కాగా కృష్ణ శుక్ల ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.