ప్రేమ పేరుతో వంచనకు గురైన జూనియర్ ఆర్టిస్టు!

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : ప్రేమ వలలో చిక్కుకొని ఎందరో యువతులు వంచనకు గురవుతున్నారు. అలాంటి కోవలోనే ఓ జూనియర్ ఆర్టిస్టు చేరిపోయింది. గర్భవతిని చేసి మొఖం చాటేసుకొని తిరుగుతున్న ఆ వంచకునిపై న్యాయ పోరాటం కోసం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 29 ఏళ్ల యువతి 2021లో హైదరాబాద్ నగరానికి వచ్చి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తూ బోరబండ ప్రాంతంలో నివాసం ఉంటున్నది. అదే రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కాకానికి చెందిన రోహిత్ ఖాన్ (24) ఆ యువతి ఫోన్ నెంబర్ సంపాదించి, పరిచయం పెంచుకున్నాడు.

తరచూ ఆమెకు ఫోన్ చేసి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని అతన్ని కోరింది.

తప్పించుకు తిరుగుతున్న వంచకుడు

ఆ యువతి పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తుండటంతో అప్పటి నుంచి రోహిత్ ఖాన్ తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు తాజాగా నగరంలోని ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకొన్నది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.