23 ఏండ్లయినా ఇంద్రారెడ్డిని మరువని ప్రజలకు రుణపడి ఉంటా
* రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
* శంకర్ పల్లి మండలం జనవాడ గ్రామంలో దివంగత ఇంద్రారెడ్డి విగ్రహావిష్కరణ
* చేవెళ్లకు ఇంద్రారెడ్డి పేరు పెట్టాలి : ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి
రచ్చబండ, శంకర్ పల్లి: 23 ఏండ్లయినా మాజీ హోం శాఖ మంత్రి దివంగత పి.ఇంద్రారెడ్డిని మరువని ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటానాని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. శంకర్ పల్లి మండలంలోని జనవాడ గ్రామంలో మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, గ్రామ వార్డు సభ్యులు గౌడిచెర్ల వెంకటేష్ సొంత నిధులతో నెలకొల్పిన దివంగత పి.ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా అయన విగ్రహాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ఆవిష్కరించారు. డప్పు వాయిద్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్యలను గ్రామస్తులు టపాకాయలు కాలుస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజలందరి నుండి దూరమై 23 ఏళ్లు అవుతున్న పల్లెల్లో ఇంకా ఇంద్రారెడ్డి పేరు మార్మోగడం సంతోషకరమన్నారు.
ఇంద్రన్న జయంతి సందర్భంగా గౌడి చర్ల వెంకటేష్ జనవాడ గ్రామంలో ఆడబిడ్డ పుట్టిన తల్లిదండ్రులకు 16 వేల నగదు కానుక కార్యక్రమాన్ని మంత్రిచే ప్రారంభించారు. గ్రామంలో మొత్తం 60 మంది ఆడబిడ్డ పుట్టిన తల్లిదండ్రులకు 16, వేల రూపాయలను అందించారు. చేవెళ్ల ఎంపీ రజిత్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గానికి స్వర్గీయ ఇంద్రారెడ్డి పేరు పెట్టాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
దివంగత ఇంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించి అందరి హృదయాలు నిలిచి, ఎందరో నాయకులను తీర్చిదిద్దిన మహానేత నేత స్వర్గీయ ఇంద్రారెడ్డి పేరును చేవెళ్ల నియోజకవర్గం పెట్టాలని పిలుపునిచ్చారు. అందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, గుడిమల్కాపూర్ ఏఎంసి మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, మండల, మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా, ఎంపీటీసీ నాగేందర్, గ్రామ ఉపసర్పంచ్ సీతారాములు, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు, మహిళలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రముఖ తెలంగాణ నాయకులు ఏపూరి సోమన్న పాటలతో అలరించారు. అంతకుముందు మండలంలోని మోకిలా గ్రామంలో దాతలు సార్క్ ప్రాజెక్టు వారు నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, శాసనసభ్యులు కాలే యాదయ్యలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమిత్ర మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సరిత రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.