కొండకల్ పంచాయతీకి సంక్షేమ పథకాలు అందకుంటే రాజీనామా చేస్తా

కొండకల్ పంచాయతీకి సంక్షేమ పథకాలు అందకుంటే రాజీనామా చేస్తా
* ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి వెల్లడి
రచ్చబండ, శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మంజూరు చేయకుంటే తన ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తానని ఆ గ్రామ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన శంకర్ పల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అనుచరులు కొందరు కొండకల్ గ్రామానికి సంక్షేమ పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఇప్పటివరకు గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు రాలేదని తెలిపారు. అలాగే దళితబంధు, బీసీ బందు పథకాలు కూడా గ్రామంలో ఎవరికీ రాలేదని చెప్పారు. మండలంలోని కొందరు ఎమ్మెల్యే అనుచరులు కొండాకల్ గ్రామానికి ఈ సంక్షేమ పథకాలు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. కొండకల్ ఎంపీటీసీ పరిధిలోని శేరిగూడ, కొండకల్ తండా గ్రామాలు ఉన్నాయని చెప్పారు. ఈ గ్రామాల్లో కూడా దళిత బంధు, బీసీ బందు పథకాలు రాలేదని తెలిపారు.

సుమారు 30 ఏళ్ల నుంచి తాను భారతీయ జనతా పార్టీలో ఉన్నానని, అలాంటిది గుడిమల్కాపూర్ మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకట్ రెడ్డి ప్రోత్సాహంతో బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీటీసీగా గెలిచానని చెప్పారు. గ్రామంలో ప్రస్తుతమున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మీదుగా రేడియల్ రోడ్డు వేస్తున్నందున త్వరలోనే ఆ పాఠశాలను పూర్తిగా కూల్చివేస్తారని తెలిపారు. గ్రామంలో పాత పాఠశాలలను కూల్చివేసి స్థలాన్ని సేకరించామని ఆ స్థలములో నూతన ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించాలని గతంలో ఎమ్మెల్యేతో కొబ్బరికాయ కూడా కొట్టించాలని తెలిపారు.

ఇప్పటివరకు పాఠశాల పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. గ్రామంలో ఉన్న ఆసుపత్రి సబ్ సెంటర్ కూలే దశలో ఉందని అందులోనే గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వెంటనే దానిని కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించాలని చెప్పారు. తమ గ్రామం పై ఎమ్మెల్యే వివక్షత చూపిస్తున్నారని ఆరోపించారు. కేవలం మండలంలో ఇద్దరు నాయకుల వల్ల తమ గ్రామంలో ఎలాంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరగడంలేదని తెలిపారు.

ఇలాంటి వారు ఉంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడవని అన్నారు. ఇలాంటి వారిని ఎమ్మెల్యే కాలే యాదయ్య దూరం ఉంచాలని హితవు పలికారు. 23 మంది బీసీ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఒకరిని కూడా ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు, 60 మంది పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న ఇప్పటివరకు ఒకరికి కూడా పెన్షన్ రాలేదని చెప్పారు. ప్రజా ప్రతినిధి అయిన నేను ప్రజలకు న్యాయం చేయకుంటే ఈ ఎంపిటిసి పదవి ఎందుకని ప్రశ్నించారు. తమ గ్రామానికి సంక్షేమ పథకాలు రాకుంటే జిల్లా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ను కలిసి తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డి. వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.