ఓ అమ్మ దిద్దిన ముగ్గురు కూతుళ్ల భవితవ్యం 

ఓ అమ్మ దిద్దిన ముగ్గురు కూతుళ్ల భవితవ్యం

అమ్మ తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు అని నిరూపించింది ఓ మహిళ. ఏకంగా సరస్వతీ దేవినే తన ఇంటికి రప్పించికున్నది. ముగ్గురు కూతుళ్ల భవితవ్యాన్ని తన స్వహస్తాలతో తీర్చిదిద్దింది. తనను వదిలేసిన భర్తకే కాదు.. సమాజంలో ఉన్న ఎందరో కుత్సిత మనస్కులకు కనువిప్పు కలిగించింది. భర్త వదిలేసిన మహిళలకు ధైర్యమై నిలిచింది. ఆడతనాన్ని అలుసుగా చూసే అల్పులకు తగిన బుద్ధి చెప్పినట్టయింది. ఆ మహిళా ఎవరు? ఏమిటి విశేషం? తెలుసుకుందాం.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శృంగవరపు కోట పట్టణంలోని శ్రీనివాసపురంలో మాచిట్టి బంగారమ్మకు సరస్వతి, రేవతి, పావని ముగ్గురు కూతుళ్లు. వారు కలిగాక ఆమె భర్త ముగ్గురూ కూతుళ్లే పుట్టారని భార్యను, పిల్లలను వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ దశలో బంగారమ్మకు చీకట్లు అలుముకున్నాయి. భర్త తోడు కరువై, బంధుత్వాలు దూరమై అగాధంలోకి నెట్టేసినట్టయింది. ఈ సమయంలో బంగారమ్మ గుండెను రాయి చేసుకుంది. కుంగిపోకుండా ధైర్యం తెచ్చుకున్నది. ఓ స్వప్నాన్ని కన్నది. తన పిల్లలే లోకంగా బతకాలని నిర్ణయించుకుంది. వారి భవిష్యత్తే లక్ష్యంగా పెట్టుకున్నది. చీకట్లను చీల్చుకున్నది. వెలుగు వైపు నడిచింది.

 

బంగారమ్మకు తెలిసింది కాయకష్టం. అది చేయడమే అవసరం అయింది. తొలుత భావన నిర్మాణరంగ కార్మికురాలిగా మారింది. వచ్చిన కూలి డబ్బులతో పిల్లలని పెంచుకోసాగింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి చదివించ సాగింది. బంగారమ్మ కష్టాలను, కుటుంబ స్థితిగతులను కళ్లారా చుసిన ఆమె ముగ్గురు కూతుళ్లు అర్థం చేసుకున్నారు. పాఠశాలలో పదో తరగతి చదివిన రెండో కూతురు రేవతిని బంగారమ్మ తన ఆర్థిక ఇబ్బందులతో చదువు మాన్పించాలనుకున్నది. కానీ పదో తరగతిలో అత్యంత ప్రతిభ చాటిన రేవతికి స్థానిక పుణ్యగిరి విద్యాసంస్థల అధినేత ఎల్. సత్యనారాయణ తన కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియెట్ ప్రవేశం కల్పించారు.

 

అత్యధిక మార్కులు సాధిస్తే భవిష్యత్తులో ఉన్నత చదువులకు తానే ఖర్చు భరిస్తానని భరోసా ఇచ్చారు. తల్లి బంగారమ్మ కష్టాలు, ఎల్‌.సత్యనారాయణ ఇచ్చిన ప్రోత్సాహంతో పట్టుదలగా చదివిన రేవతి ఇంటర్మీడియెట్ లో 984 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ చాటింది. ఎంసెట్ లో రాంక్ సాధించి గాయత్రీ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఏపీపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయింది.

 

2023 ఆగస్టులో రేవతి ఏపీపీఎస్సీ పరీక్షలు రాసింది. నవంబర్ లో విడుదలైన ఫలితాల్లో విజయం సాధించింది. రేవతికి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈగా నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫంబ్రవరి 6న ఉత్తర్వులు జరీ చేసింది. ఆదేవింధంగా రేవతి అక్క సరస్వతి ఏలూరులో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నది. వారి చెల్లెలు పావని పీహెచ్దీ చేస్తున్నది. ఇలా ముగ్గురు కూతుళ్ళ భవితవ్యాన్ని బంగారమ్మ తీర్చిదిద్దింది. బంగారమ్మ లక్ష్యాన్ని ఈమె కూతుళ్లు సరస్వతి, రేవతి, పావని నెరవేర్చారు.