ఈటల కొత్త పార్టీ?

* తెలంగాణలో రాజకీయ ముసలం

* మంత్రి ఈటలపై భూకబ్జా ఆరోపణలతో ప్రకంపనలు

* ఈటల కు మూడు ప్రత్యామ్నాయాలు

* మంత్రి భవితవ్యంపై విశ్లేషకుల అంచనా

 

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవితవ్యంపై రాష్ట్రంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట పరిధిలో అసైన్డ్ భూములను మంత్రి ఈటల కబ్జా చేసినట్టుగా వచ్చిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ శుక్రవారం విచారణకు ఆదేశించారు. ఆ వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి ఈటల ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో గత కొంతకాలంగా ఈటలకు అటు కేసీఆర్ మధ్యనున్న అంతర్గత విబేధాలు ఒక్కసారిగా బయటపడినట్లయింది.

ఆరోపణల్లో నిజానిజాలెలా ఉన్నా గత కొంతకాలంగా ఈటల రాజేందర్ ను బయటకు పంపుతారన్న ఊహాగానాలకు బలం చేకూరింది. అదే విధంగా ఈటల గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న ధిక్కార స్వరాన్ని మరింత పెంచేందుకు ఊతమిచ్చింది. తన సచ్ఛీలతను నిరూపించుకున్నాకే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటానని ఈటల ప్రకటించడంతో రాజీనామాపై మరింత ఉత్కంఠకు దారి తీసే అవకాశం ఏర్పడింది. ఏదేమైనా తన మంత్రి పదవికి ఈటల రాజీనామా చేసేలా ప్రభుత్వం నుంచి మరింత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశముంది. ప్రభుత్వమైనా బర్తరఫ్ చేసే దాకా సమస్య జఠిలమయ్యే పరిస్థితి ఏర్పడనుంది. మొత్తానికి ప్రభుత్వం నుంచి ఈటల బయటకు వెళ్లే అవకాశమైతే ఉంది.

ఈటల పార్టీని చీలుస్తారా?

గత కొన్నాళ్లుగా అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపిస్తూ వస్తున్న మంత్రి ఈటల రాజేందర్ ఆనాటి నుంచే టీఆర్ఎస్ పార్టీలో తన మద్దతును కూడగట్టుకుంటూ వచ్చారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు మంత్రులతో చర్చలు జరిపినట్లు వారు పేర్కొంటున్నారు. దీంతో పాటు పలువురు ఎమ్మెల్యేల మద్దతు కోసం పరోక్షంగా చర్చలు జరిపించినట్లు వారు అంచనా వేస్తున్నారు. ఈ దశలో వారంతా సిద్ధంగా ఉన్నారా.. లేరా.. అన్నది తేలాల్సి ఉంది. అయితే మంత్రి కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చో బెట్టేందుకు ఓ దశలో నిర్ణయానికి వచ్చాక పలువురు ఎమ్మెల్యేలు ఆయన పంచన చేరి, మద్దతుగా నిలిచారు. ఇంకా ఎందరో ఎమ్మెల్యేలు తమకు ప్రాధాన్యం దక్కదేమోనని కేటీఆర్ కు దూరభారం పాటిస్తూ వస్తున్నారు. వారేమైనా ఈటల, ఆయనతో జట్టు కట్టే మంత్రుల వైపు చేరుతారా.. యథాతధంగా ఉంటారా.. అన్నది తేలాల్సి ఉంది.

మరో పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుడతారా?

సీఎం కేసీఆర్ ను ప్రముఖంగా వ్యతిరేకిస్తున్న కొందరు ముఖ్య నేతలతో కలిసి మంత్రి ఈటల రాజేందర్ కొత్త పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుడతారని విశ్లేషకులు మరో అంచనా వేస్తున్నారు. మంత్రి ఇటీవల తన అంగరక్షకులను వదిలి ఒంటరిగా ఏదో నిగూడ ప్రాంతానికి వెళ్లొచ్చినట్టు ప్రభుత్వ వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందిందని ప్రచారం సాగింది. ఆయన బీజేపీ పెద్దలతో పాటు తీన్మార్ మల్లన్న, మాజీ ఎంపీ కొండా మరికొందరిని వేర్వేరుగా కలిసి చర్చలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా బీసీ, ఎస్సీ సంఘాల నేతలు కూడా ఆయనను పార్టీ పెట్టాలంటూ గత కొంతకాలంగా కోరుతూ వస్తున్నట్లు సమాచారం. ఏదైమైనా ఆయన పార్టీ పెడితే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుందా.. లేదా.. అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

బీజేపీలో చేరుతారా?

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో మంత్రి ఈటల రాజేందర్ చేరే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు మూడో అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర పెద్దలతో చర్చించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారు కేంద్రంలోని అధిష్ఠానం పెద్దలతోనూ ఈటలతో మాట్లాడించినట్లు అనుకుంటున్నారు. రాష్ట్రంలోని తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉండటంతో పాటు బీసీ, దళిత వర్గాల్లో కొంత సానుభూతి ఉన్న కారణంగా బీజేపీ అధిష్ఠానం ఈటలకు బలమైన హామీ ఇచ్చే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా మంత్రి ఈటల రాజేందర్ కు ఉన్న మూడు ప్రత్యామ్నాయాలలో ఏదైనా ఒకదానిని ఆశ్రయిస్తారా.. లేదా.. మరేదైనా ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నారా.. అనేది వేచి చూడాలి మరి.