ప్రగతి భవన్ కు సోనూసూద్

– మంత్రి కేటీఆర్ ను కలిసిన సినీ నటుడు

ప్రముఖ సినీ నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్ మంగళవారం హైదరాబాద్ లో ప్రగతి భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావును ఆయన కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు.

దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోను సూద్ పని చేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఈ సందర్భంగా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, ఈ సేవా రంగంలో తన భవిష్యత్తు ప్రణాళికలను మంత్రి కేటీఆర్ తో పంచుకున్నారు. తన తల్లి స్ఫూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా  హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని సోనూసూద్ పంచుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకు ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే, ఇతరుల కంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనుసూద్ పేర్కొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్, సోనూసూద్ కు లంచ్ ఏర్పాటు చేశారు. తర్వాత సోనూసూద్ ను శాలువాతో సత్కరించి.. ఒక మేమొంటో ను మంత్రి కేటీఆర్ అందజేశారు.