రియల్టర్ హత్యకేసును ఛేదించిన పోలీసులు.. కర్ణాటక గ్యాంగుకు రూ.30 లక్షల సుపారీ

హైదరాబాద్ : నాలుగు రోజులు క్రితం జరిగిన రియల్టర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భారీ సుపారీతో కర్ణాటక ముఠా ఈ ఘాతుకానికి పాల్పడిందని నిగ్గు తేల్చారు. తన తండ్రిని హతమార్చాడనే కసితో అతని కుమారుడే ఈ హత్యకు ప్లాన్ చేశాడని నిర్ధారణకు వచ్చారు.

అసలేం జరిగింది!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి దమ్మాయిగూడలో నాలుగు రోజులు క్రితం రఘు అనే రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో రాచకొండ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

ప్రతీకారం తీర్చుకునేందుకు ప్లాన్
పదేళ్ల క్రితం దమ్మాయిగూడలో మాజీ సర్పంచ్ జంగారెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో రఘు ప్రధాన నిందితుడు. తన తండ్రి హత్యకు ప్రతీకారంగా ఎలాగైనా రఘును తుద ముట్టించాలని జంగారెడ్డి తనయుడు శ్రీకాంత్ రెడ్డి ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

రూ.30 లక్షలతో సుపారీ గ్యాంగ్
కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ ప్రాంతానికి చెందిన సుపారీ గ్యాంగ్, తన తండ్రి స్నేహితుడి సహకారంతో ప్రణాళిక రచించాడని చెప్పారు. రూ.30 లక్షలతో సుపారీ గ్యాంగుతో ఒప్పందం కుదుర్చుకొని రఘును హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసులో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.