శభాష్ రా క్లాస్ మేట్

ఎక్కడో దానం చేశా.. ఎవరికో సాయం చేశా.. ఎంతో మందిని ఆదుకున్నా.. అనే వారు ఎందరో ఉంటారు. కానీ మన పక్కనే ఉండి కడుపు మాడ్చుకొని బతుకీడ్చే వారిని గుర్తించలేరు. కొందరు గుర్తించరు కూడా.. కానీ కరోనా కష్టకాలంలో తనతో కలిసి పదో తరగతి వరకు చదువుకున్న ఇద్దరు క్లాస్ మేట్లకు చిరుసాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు ఆ పోలీస్ ఉద్యోగి ఏశమళ్ల లక్మీనారాయణ. పైఫొటోలో ఉన్న వ్యక్తే ఆ కానిస్టేబుల్. ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు.

తనతో కలిసి చదువుకున్న ఇద్దరు క్లాస్ మేట్లు (పేర్లు వద్దనుకున్నాం. వారికి పంపిన ఫొన్ పే స్లిప్ ను ఒక దానిని పైఫొటోలో పెట్టాము.) ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న విషయాన్ని గుర్తించాడు. ఒకరు మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తుండగా, మరొకరు ఇదే జిల్లాలోని దేవరకొండ పట్టణంలోని ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నాడు. కరోనా కష్టకాలంలో ఏడాది కాలంగా ఉపాధి కరువై అవస్థలు పడుతున్న విషయాన్ని గుర్తించాడు.

కరోనా కష్టకాలంలో తనకు ఉద్యోగం ఉంది. తన కుటుంబం ఎలాగోలా గడుస్తుంది.  ప్రైవేటు టీచర్ల దుస్థితిని మీడియా ద్వారా విని తన మిత్రులు ఎలా కాలం వెళ్లదీస్తున్నారోనని ఆలోచించాడు. వారి కుటుంబ పరిస్థతుల గురించి తెలుసుకున్నాడు. ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించాడు. వారి దుస్థతిపై మదన పడ్డాడు. ఎలాగైనా ఎంతోకొంత సాయం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గతంలో మిర్యాలగూడ పట్టణంలో ఉండే ప్రైవేట్ టీచర్ కు క్వింటా బియ్యం, రూ.2,000 నగదు అందజేశాడు. ఇటీవల దేవరకొండలో ఉండే ప్రైవేట్ టీచర్ కు బియ్యం, రూ.2,000 నగదు అందజేసి వితరణ చాటుకున్నాడు.

ఆయన సాయం చేసి ఖాళీగా ఉండకుండా అవస్థలు పడుతున్న ఆ ఉపాధ్యాయ కుటుంబాలను ఆదుకోవాలంటూ తన తోటి నాటి క్లాస్ మేట్లకు సిఫారసు చేశాడు. దీంతో ఆయన చేసిన సాయాన్ని తోటి క్లాస్ మేట్లు శభాష్.. అంటూ మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని వారు ‘రచ్చబండ’కు తెలిపారు. ఇదే విషయాన్ని లక్మీనారాయణ చేసిన సాయం విషయం మరింత మందికి తెలిసింది.

ఇలా తోటి వాళ్లు ఎవరైనా ఆపదలో ఉంటే కనీసం తెలుసుకొని సాయం చేసే వాళ్లు నిజంగా దేవుళ్లు కాకపోవచ్చేమో కానీ.. ఆపద్భాంధవులు అవుతారు. ఈ కరోనా కాలంలో ఎన్నో రంగాలు కుదేలయ్యియి. ఎందరో ఉపాధి కోల్పోయారు. అలాంటి వారిని గుర్తించి, కాస్త కలిగిన స్నేహితులు ఆదుకుంటే అదే పదివేలు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వేటుకు బలైన ప్రైవేటు ఉపాధాయులను అంతో ఇంతో కలిగిన తోటి నాటి క్లాస్ మేట్లు ఆదుకుంటారు కదూ..

ఇది చిరు సాయమే అయినప్పటికీ పెద్ద మనసుతో చేశాడు. కనుక ఇది ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తందని మేము పంపుతున్నాము. ఈ వార్తను మీమీ గ్రూపుల్లో షేర్ చేస్తే.. స్పందించి ఎవరో ఒకరు.. మరొకరిని ఆదుకోవడానికి సాయం చేసిన వారవుతారు.