• చిట్టెంపల్లి మైనర్ హత్య కేసులో నిందితుడి అరెస్టు
• లైంగిక దాడికి ఒప్పుకోలేదని దాడి
• అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలిక
• అదే స్థితిలో దుండగుడి లైంగిక దాడి.. అక్కడే ప్రాణాలిడిసిన బాలిక
• 48 గంటల్లోపే కేసును ఛేదించిన పోలీసులు
• కేసు వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
పరిగి : వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం చెన్ గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగడి చిట్టెంపల్లి గ్రామంలో బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు బాలికపై లైంగికదాడికి పాల్పడి, దారుణ హత్యకు కారకుడయ్యాడు.
ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 48 గంటల్లోపు కేసును ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి బుధవారం పరిగి పోలిస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన కావలి మహేందర్ అలియాస్ నాని తానే ఈ దారుణానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు మహేందర్ కు ఆ బాలికతో ముందుగానే పరిచయం ఉన్నది. సుమారు 11 నెలల నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. అయితే ఎలాగైనా ఆమెతో తన కామ వాంఛ తీర్చుకోవాలనే కోరిక కలిగి ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
ఇదేనెల 25న శుక్రవారం వీరి మధ్య ప్రేమ వ్యవహారం బాలిక చెల్లెలి ద్వారా ఆమె తల్లికి తెలిసింది. దీంతో ఆమె బాలికను మందలించింది. ఇదే విషయం ఆ బాలిక నిందితుడికి తెలిపింది. ఇదే అవకాశాన్ని వాడుకోవాలని అనుకొన్న నిందితుడు పథకం ప్రకారం సదరు బాలికను 27న అర్ధరాత్రి దాటాక కలుద్దామని తెచ్చిన ఒత్తిడి మేరకు బాలిక ఒప్పుకొన్నది.
అసలేం జరిగింది..
వారిద్దరూ ముందుగా అనుకున్న ప్రకారంగా రాత్రి ఒక చోటుకు చేరుకున్నారు. కొద్దిసేపు మాట్లాడాక నిందితుడు మహేందర్ ఆ బాలికను కామవాంఛ కోసం బలవంతం చేశాడు. ఆమె నిరాకరిస్తూ వెనక్కి నెట్టేసింది. కోపం పెంచుకున్న నిందితుడు బాలిక తల వెంట్రుకలు పట్టుకొని వేప చెట్టుకు గట్టిగా గుద్దడంతో ఆమె తలకు బలంగా దెబ్బ తగిలింది. వెంటనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అదే సమయంలో స్పృహ తప్పి ఉన్న బాలికపై కామవాంఛ తీర్చుకున్నాడు. ఆమె ఏస్థితిలో ఉన్నది కూడా గమనించలేదు. ఆమె తలకు బలమైన గాయం కావడంతో పాటు లైంగికదాడి జరగడం వల్ల వెంటనే ఆమె చనిపోయిందని ఎస్పీ తెలిపారు.
ఘటనా స్థలానికి మళ్లీ వచ్చిన నిందితుడు
ఘటన జరిగిన వెంటనే నిందితుడు మహేందర్ అక్కడి నుంచి తన స్నేహితుడైన సుఖిందర్ ఇంటికి వెళ్లాడు. మైనర్ చనిపోయిందంటూ ఊరిలో ప్రచారం కావడంతో నిందితుడు స్నేహితుడైన సుఖిందర్ తో కలిసి మళ్లీ అక్కడికి వెళ్లి దూరం నుంచే చూశారు. అప్పటికి గ్రామస్థులు పెద్ద ఎత్తున గుమిగూడి ఉన్నారు. కొంతసేపటి తర్వాత పోలీసులు అక్కడికి చేరి విచారణ చేపట్టడంతో అక్కడి నుంచి జారుకున్నాడు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు చర్యలు
కేసు వివరాలను సేకరించిన పోలీసులు వెంటవెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం ఉదయం నిందితుడు తన ఇంటి వద్ద ఉండగా అరెస్టు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ కేసులో బలమైన సైంటిఫిక్, టెక్నికల్, ఇతర సాక్ష్యాలు సేకరించినట్లు వివరించారు.
నిందితుడికి కఠిన శిక్ష పడేటట్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ తెలిపారు. బాలికలు, యువతులు ఇలాంటి మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన హితవు పలికారు. ఇలాంటి వారితో ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోటిరెడ్డి సూచించారు.