సిరిసిల్ల టౌన్: ఆహా ఓటీటీ వేదికగా మీ షోలను మేము కూడా చూశాం.. అద్భుతంగా పాడుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొనే స్థాయికి వెళ్లడం గర్వించదగ్గ అంశం.. మీ జర్నీ స్ఫూర్తిదాయకం..
చదువొక్కటే కాదు.. భిన్న రంగాల్లో రాణించేందుకు అవకాశం ఉందని నిరూపించారు.. నేటి యువతకు మీ ప్రస్థానం ప్రేరణగా నిలుస్తుంది.. అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలుగు ఇండియన్ ఐడల్ ఫేం కోడిమోజు మారుతిని కొనియాడారు.
తెలుగు సింగర్స్ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు నిర్వహిస్తున్న తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా తెలుగు ఇండియన్ ఐడల్ పేరుతో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. పేదరికం వెంటాడుతున్నా, సంగీతంలో సరైన శిక్షణ లేకున్నా.. హోటల్ లో పని చేస్తూ.. స్వయం కృషి, పట్టుదల పెట్టుబడిగా, స్వీయ ప్రతిభతో చక్కటి గాత్రంతో.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావు పేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కొడిమోజు మారుతి వీక్షకులతో పాటు జడ్జీల మన్ననలను పొందారు.
సరైన ప్రచారం లేక ఇటీవలే కార్యక్రమం నుంచి నిష్క్రమించారు. కాగా సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన మారుతి డీపీఆర్వో మామిండ్ల దశరథo, తన అన్న తెలంగాణ సాంస్కృతిక సారథి లక్ష్మీ నారాయణతో కలిసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని కలెక్టరేట్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.
మారుతిని మనస్పూర్తిగా అభినందించిన కలెక్టర్ శాలువా, పుష్ప గుచ్ఛంతో సన్మానించారు. కొద్ది నిమిషాల సేపు కలెక్టర్ మారుతితో సమావేశమై అతని పాటల ప్రయాణం, ఇండియన్ ఐడల్ పోటీలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తాను, కుటుంబ సభ్యులతో కలసి తెలుగు ఇండియన్ ఐడల్ లో ప్రదర్శనలు చూశామని, అద్భుతంగా పాడుతున్నారని కితాబు ఇచ్చారు.
భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధరోహించాలని కోరుకుంటున్నామని అన్నారు. చదువొక్కటే కాదు.. భిన్న రంగాల్లో రాణించేందుకు అవకాశం ఉందని నిరూపించారని ప్రశంసించారు. నేటి యువతకు మీ జర్నీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని అని కలెక్టర్ కొనియాడారు.