షర్మిల పార్టీకి రూ.రెండు వేల కోట్ల నిధులు ఎవరిచ్చారు?

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ముందస్తు చర్యల్లో ఆమె బిజీగా ఉన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల అభిమానులతో హైదరాబాద్ లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన ఆమె తాజాగా ఖమ్మంలో సంకల్ప సభ ద్వారా ప్రజల్లోకి వచ్చారు.

ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఖరీదైన కార్లు, ఇతర వాహనాల్లో కార్యకర్తలు తరలివచ్చారు. భారీతనంతో సభ నిర్వహించారు. అదే విధంగా ఈనెల 15న ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టనున్నట్లు ఖమ్మం సభలోనే షర్మిల ప్రకటించారు.

అయితే ఆమె తెలంగాణలో ఇప్పుడే పార్టీ పెట్టడానికి కారణమేమిటి.. నిధులను ఎక్కడి నుంచి సమకూరుస్తారు.. పార్టీ నిర్వహణకు సరిపోను నిధులు సమకూరాయా.. ఎవరిస్తారు.. అని రాజకీయ విశ్లేషకులే కాదు.. రాజకీయ పరిగ్నానం ఉన్న సగటు కార్యకర్తకు అనుమానం కలిగే ప్రశ్నలు. అసలు తెలంగాణ మీద అభిమానం ఉన్నా.. తెలంగాణ ప్రజల సంక్శెమమె మిన్న అనుకున్నా.. షర్మిల గత రెండు సాధారణ ఎన్నికలకు ముందు పార్టీ ఎందుకు పెట్టలేదు. పెట్టాలనే ఆలోచనే ఎందుకు రాలేదు.. అన్న సాధారణ ప్రశ్నలు తెలంగాణ ప్రజల్లో రేకెత్తుతున్నాయి.

షర్మిల పార్టీకి నిధులెలా వచ్చాయి?

తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీకి సుమారు రూ.2,000 కోట్ల నిధులు సమకూరాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరు పంపారు. ఎందుకు పంపారు. అన్న ప్రశ్నలకు మూడు అనుమానాలు కలుగుతున్నాయి.

అన్న వదిలిన బాణమేనా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలోనూ గణనీయమైన అభిమానగణం ఉంది. ఆయనకు ముందు నుంచే తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాలనే తపన ఉంది. అయితే మొదట రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం దక్కితే తెలంగాణపై ద్రుష్టి పెట్టేవారు. ఇటు 2018 ఎన్నికల్లోనైనా తెలంగాణలో అడుగు పెట్టేవాడు. కానీ మొదటి సారే ఓటమి పాలు కావడంతో ఏపీ పైనే ద్రుష్టి పెట్టాడు. దాంతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ తో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడటంతో తెలంగాణలో కాలుమోపాలన్నతన ఆలోచనను విరమించుకున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.

అన్నావదినలతో విబేధాలు లేవు.. అమ్మ దీవెనలు ఫుల్

అయితే కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో జగన్మోహన్ రెడ్డి తాను తెలంగాణలోకి రాలేకపోయినా తన కోరికను నెరవేర్చుకోవడానికి ఇప్పడు తన చెల్లెలిని పంపాడని కొందరు విశ్లేషకుల భాష్యం చెప్తున్నారు. ఓదార్పు యాత్ర సమయంలో ఆయన లేకున్నా షర్మిల తాను అన్న వదిలిన బాణం.. అంటూ ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలు కూడా ఆమెను జగన్మోహన్ రెడ్డితో సమానంగా స్వీకరించారు. ఇప్పటికీ వైఎస్సార్ ఛరిస్మా అటు జగన్మోహన్ రెడ్డితో పాటు షర్మిలకూ వర్తిస్తుంది.. అని అందరూ అంటున్నారు.

తాను లేకున్నా తన చెల్లెలి ద్వారా తెలంగాణలో ప్రవేశించి రాజకీయ ప్రాబల్యం సంపాదిస్తే కేంద్రంలో ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని అంచనాగా భావిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలి ద్వారా రాజకీయ పార్టీ ఏర్పాటుకు ప్రోత్సహించారని అంటున్నారు. నిధులను కూడా సమకూర్చినట్లు అనుకుంటున్నారు. కొందరు అనుకుంటున్నట్లుగా అన్న, వదినతో విబేధాలు ఉన్నాయనేది వాస్తవం కాదన్నది విశ్లేషకుల వాదన. తల్లి విజయమ్మ దీవెనలు కూడా ఉండటం గమనార్హం. ఆమె స్వయంగా ఖమ్మం సభలో పాల్గొనడం విశేషం.

షర్మిల వెంట వైఎస్సార్ పార్టీ ముఖ్యనేతలు

అదే విధంగా తెలంగాణలో ఉన్న వైఎస్సార్ పార్టీ నేతల్లో అత్యధిక శాతం షర్మిల పార్టీకి అండగా నిలుస్తుండటం కూడా దీనికి బలం చేకూరుస్తున్నది. అన్ని జిల్లాల్లోని ప్రధాన నేతలందరూ ఆమె వెంట నడుస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నేతకు ఏపీలోని ఓ ప్రధాన నామినేటెడ్ పోస్టు కూడా ఉండి షర్మిల వెన్నంటి ఉండటం దేనికి సంకేతమో అర్ధం చేసుకోవచ్చు. ఒకవేళ అన్నతో విబేధాలుంటే చెల్లెలి వెంట నడిచే తమ పార్టీ నాయకులను ఎందుకు వారించడం లేదు.. నామినేటెడ్ పదవి ఉన్నా బహిరంగంగా తిరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు.. అని విశ్లేషకులు ఆధారాలు చూపుతున్నారు.

తెలంగాణలో పరిస్థితులను బట్టి తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన మరో రాజకీయ సమాలోచన అయి ఉంటుందని కొందరంటున్నారు. ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉంది. వారిలో ఎక్కువ మంది వైఎస్ అభిమానులున్నారు. వారంతా షర్మిల పార్టీలో చేరితే తన వ్యతిరేక పార్టీ ఓట్లు చీలుతాయన్నది కేసీఆర్ ఆలోచన అయి ఉంటుందని వారు చెప్తున్నారు.

అయితే కేసీఆర్ తన ఆలోచనను ముందుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లు అంటున్నారు. ఆయన ద్వారానే చెల్లెలితో పార్టీని పెట్టిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇటు కేసీఆర్ వదిలిన బాణమే షర్మిల అంటూ విశ్లేషిస్తున్నారు. ఏదేమైన షర్మిల పూర్తిస్థాయిలో పార్టీ పెట్టి రంగంలోకి దిగితే ఆమె వైఖరిని బట్టి మరింత అంచనా వేయెచ్చన్నది రాజకీయ విశ్లేషకుల ఆలోచన.