బ్రోకెన్ పోల్స్, వేలాడే వైర్లు తొలగించాలి

పల్లె, పట్టణ ప్రగతి కార్యాచరణలో తప్పక పాల్గొనాలి

విద్యుత్ ఉద్యోగులకు మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్ లో ప్రత్యేక సమీక్ష సమావేశం

 హైదరాబాద్‌ : బ్రోకెన్ పోల్స్, వేలాడే విద్యుత్ వైర్లను తొలగించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యాచరణ కార్యక్రమాల్లో విద్యుత్ ఉద్యోగులు విధిగా పాల్గొనాలని ఆదేశించారు. వానాకాలం పంటలతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ లకు అవసరమయ్యే విద్యుత్ పై సోమవారం సాయంత్రం హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లోని తన ఛాంబర్ లో మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖా ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ  దేవులపల్లి ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

వానాకాలంలో విద్యుత్ సిబ్బంది, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఆయన ప్రత్యేక సూచనలు చేశారు. వ్యవసాయ అవసరాలకు కావాల్సిన విద్యుత్ కనెక్షన్లు దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకోవాలని విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందిని ఆదేశించారు.