ఆగస్టు 9నుంచి బండి సంజయ్ పాదయాత్ర

హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగస్టు 9వ తేదీ నుంచి రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఆ పార్టీ పదాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 9న హైదరాబాద్ భాగ్యలక్షీ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర హుజూరాబాద్ లో ముగియనుంది. క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన రోజున పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పాదయాత్ర చేపడుతున్నట్లు సంజయ్ తలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచక, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేస్తానని ఈ సందర్భంగా సంజయ్ వెల్లడించారు. ఈ పాదయాత్రను బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన కోరారు.