రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : దొంగతనాలు పలు రకాలు. రైల్వేస్టేషన్లలో, జంక్షన్లలో రైలు కదిలే సమయంలో ప్రయాణికుల చేతుల్లోని సెల్ ఫోన్లను లాక్కెళ్లే దొంగ అతను. ఇక్కడా అదే చేయబోయాడు. కానీ విధి తిరగలబడింది. ఆ ప్రయాణికుడు కిటికీ లోంచి గమనించి దొంగకు చేసిన బుద్ధి అతన్ని శుద్ధి చేసినంత పనైంది. మళ్లీ దొంగతనం వైపు చూడకుండా చేసింది.
ఈనెల 14న జరిగిన ఈ ఘటన ఉత్సుకతను రేకెత్తించేలా ఉంది. బిహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ నగరం నుంచి ఖగారియా వెళ్లేందుకు రైలు ఎక్కాడు. కిటికీ వద్ద నిల్చున్నాడు. రైలు కదలడం మొదలైంది. అతని చేతిలో సెల్ ఫోన్ ఉంది. దానిని కొట్టేసేందుకు ఓ దొంగ మెరుపు వేగంతో లోనికి చేతులు పెట్టాడు.
దొంగ ప్రయత్నాన్ని గమనించిన ఆ ప్రయాణికుడు అంతే వేగంతో దొంగ రెండు చేతులు దొరక బుచ్చుకున్నాడు. రైలు వేగం పెరిగింది. ఇంకేముంది రైలుకు వేలాడటం దొంగ వంతయింది. విలవిల్లాడుతూ దు:ఖిస్తూ ప్రాథేయపడ్డాడు. తప్పయిందని వేడుకున్నాడు. అయినా ఆ ప్రయాణికుడు కనికరించలేదు.
ఖగారియాకు 10 కిలోమీటర్లు దూరం ఉంది. అప్పటి వరకూ లోపలి నుంచి దొంగ చేతులు విడవకుండానే పట్టుకున్నారు. దొంగ వేలాడుతూ అలాగే ఉండాల్సి వచ్చింది. రైలు నెమ్మదించగానే ఆ ప్రయాణికుడు దొంగకు వేసిన శిక్ష చాలనుకొని వదిలేశాడు. అంతే బతుకు జీవుడా అంటూ పరుగు లంఖించుకున్నాడు. మళ్లీ దొంగతనం వైపు కన్నెత్తి చూడొద్దు అనుకునేలా శిక్ష వేసినంత పనైంది.