రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై శంకర్ పల్లి మండలంలో నిరసన

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై శంకర్ పల్లి మండలంలో నిరసన
* మోకిలా, మీర్జాగూడ గ్రామాల్లో రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం

రచ్చబండ, శంకర్ పల్లి; కాంగ్రెస్ పార్టీ దురుద్దేశం, రైతు వ్యతిరేకి అన్ననిజం తేట తెల్ల మైందని శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సభావత్ రాజు నాయక్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ గ్రామ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్ అన్నారు. బుధవారం మోకిలా, మిర్జాగూడ గ్రామాలలో, ఆయా గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ చారి, ఒగ్గు అంజయ్యలతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు వర్ణనాతీతం అని, వారి ప్రభుత్వాల హయాంలో కరెంటు ఎప్పుడొస్తదో తెలవక బోరు బావుల వద్ద రైతులు పడిగాపులు కాసేవారని తెలిపారు. రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలంగాణ సర్కార్ ఉద్దేశం అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో కరెంటు కష్టాలు తొలగాయన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని అన్నారు.

నాడు కరెంట్ వస్తే వార్త.. నేడు కరెంటు పోతే వార్త అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు. 20 17 జనవరి 1 నుండి రాష్ట్ర సర్కార్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నదని తెలిపారు. దేశంలోనే నిరంతర ఉచిత విద్యుత్తు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. అంతేకాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు నిరంతరం విద్యుత్తును సరఫరా చేస్తున్నదని తెలిపారు. సమైక్యాంధ్ర పాలన నుంచి నేటి వరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రథమ శత్రువుగా మారిందని దుమ్మెత్తి పోశారు. కరెంటు అడిగితే కాల్చి చంపిన చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి రైతులను ముంచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులు గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ దేనిని, మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను బయట పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగ చేస్తుంటే, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ను పాతర వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి ఫరీద్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు మన్నె లింగం ముదిరాజ్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.