డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో స్థానికులకు అన్యాయం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో స్థానికులకు అన్యాయం
* బీజేపీ శంకర్ పల్లి మండల నాయకుల ఆరోపణ

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపల్ శివారులో నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీలో స్థానికులకు అన్యాయం జరిగిందని మండల బిజెపి నాయకులు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలోని గెస్ట్ హౌస్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాదారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను గొంతెమ్మ కోరికలతో మోసం చేస్తున్నారని తెలిపారు. శంకర్ పల్లి లో 1500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. అందులో చేవెళ్ల నియోజకవర్గం ప్రజలకు 151 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించారని తెలిపారు.

నియోజకవర్గం లోని గ్రామాలలో సుమారు ఇండ్లు లేని కుటుంబాలు 50 వరకు ఉంటాయని చెప్పారు. అయితే ఇక్కడి ప్రజలను పక్కనపెట్టి హైదరాబాద్ లోని కార్వాన్ ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఇక్కడ 13 61 ఇండ్లను కేటాయించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సీఎం గా ఎన్నికైనప్పుడు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటానని, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూములు కట్టిస్తానని వాగ్దానం చేశారన్నారు. అయితే ఆ వాగ్దానానికి సీఎం నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. కల్లిబొల్లి మాటలతో రెండుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రశేఖర రావు పదవి బాధ్యతలు చేపట్టారని ఆరోపించారు.

స్థానికులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి ఈ శంకర్పల్లిలో ఇండ్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలకు ఇల్లు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఇది ఇలా ఉంటే గ్రామాలకు సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఓటర్లకు కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలో రావడానికి ప్రయత్నిస్తారని ఈసారి ఇలాంటి మాటలకు ప్రజలు సరైన జవాబు చెబుతారని తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు ఎల్. ప్రభాకర్ రెడ్డి. చేవెళ్ల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి, జిల్లా నాయకులు జయరామిరెడ్డి, మున్సిపల్ బిజెపి అధ్యక్షుడు బీర్ల సురేష్, మండల ఉపాధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.