ఓ ఉపాధ్యాయుడి నిస్వార్థ సేవకు నిజమైన గుర్తింపు

ఓ ఉపాధ్యాయుడి నిస్వార్థ సేవకు నిజమైన గుర్తింపు
రచ్చబండ, శంకర్ పల్లి : సేవయే పరమావధిగా తలంచి, తాను పనిచేస్తున్న పాఠశాలనే కాకుండా, తాను ఉంటున్న ప్రాంతమే కాకుండా, అన్ని పాఠశాలలు మనవే అనీ, అన్ని ప్రాంతాలు, అందరు పిల్లలు మనవాళ్లే అని భావించి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బడుగు బలహీన, పేద నిరుపేద వర్గాల పిల్లలకు చేయూతనందిస్తున్నారు ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్.

పేద విద్యార్థుల అవసరాలను తెలుసుకొని వారి చదువుకు అవసరమయ్యే నోట్ పుస్తకాలు, పెన్నులు, పలకలు, బ్యాగులు, పరీక్ష అట్టలు తదితర చదువుకు ఉపయోగపడే స్టేషనరీని దాతల సహకారంతో సమకూరుస్తున్నారు. పేద విద్యార్థులు చదువును మధ్యలో మానేయకుండా ముందుకు తీసుకెళ్లడం కోసం కృషి చేస్తు, సహాయం కోరిన వారి అవసరాలను తన శక్తి సామర్థ్యం మేరకు దాతలచే తీరుస్తూన్న ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్. ఆయనకు వాల్మీకి ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన సేవా గురువు అవార్డు 2023ను ప్రదానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ సూర్య గణేష్ వాల్మీకి, సెక్రటరీ జనరల్ హరికిషన్ వాల్మీకి మాట్లాడుతూ ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ సమాజం కోసం, సమాజ అవసరాల కోసం తన యొక్క టైం, టాలెంట్, ట్రెజరీని కేటాయించడంలో ముందు వరుసలో ఉంటారని కొనియాడారు. వాల్మీకి ఫౌండేషన్ కార్యక్రమాలే కాకుండా తాను అనేక స్వచ్ఛంద సంస్థలతో మమేకమై వారితో కలిసి నిస్వార్ధంగా పనిచేస్తూ, తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి సమాజంలోని అన్ని వర్గాలలో ఉన్న పేద విద్యార్థుల అవసరాలను గుర్తించి వాటిని తీర్చడంలో తన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ ఉంటారని తెలిపారు. అందుకే వారి సేవలు వెలకట్టలేనివని భావించి ఈ రోజున వారికి సేవ గురువు అవార్డు ప్రధాన చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

వారి సేవలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ అవార్డు ఒక బాధ్యతగా దోహదపడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు, మరియు సహాయం అవసరమైన వారికి సేవ చేయడంలో ఎనలేని ఆనందం కలుగుతుందని, డబ్బులతో కొనలేని సంతృప్తిని సేవ రూపంలో సంపాదించుకోవచ్చని,ఈ యొక్క సేవా గురువు అవార్డు నా యొక్క బాధ్యతను మరింత పెంచిందని, సమాజ సేవకు ఎప్పుడు కంకణ బాధ్యుడినై ఉంటానని తెలిపారు.