గ్యాంగ్ రేప్ కేసుపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ ఆమ్నేషియా పబ్ రేప్ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. కీలక మలుపుల అనంతరం మంగళవారమే పోలీసు అధికారులు కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు.

విదేశీ పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం స్వదేశానికి వచ్చీరాగానే ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసు సంఘటనపై ఆయన లేవనెత్తిన అంశాలు తీవ్ర చర్చకు దారితీసింది.

జూబ్లీహిల్స్ లైంగికదాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచి పెట్టారని ఆరోపించారు.

బెంజ్ కారు యజమాని ఎవరో, ఇన్నోవా కారు ఎవరిదో అన్న విషయాలను పోలీసు అధికారులు వెల్లడించలేదని రేవంత్ తేల్చిచెప్పారు. ప్రభుత్వ వాహనం అని ఉన్న స్టిక్కర్లను తొలగించింది ఎవరని ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఆ వాహనాల యజమానులకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

సూత్రదారులు, పాత్రదారులు ఎవరన్న విషయాలను పోలీసు అధికారులు చెప్పలేదని రేవంత్ వ్యాఖ్యానించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడింది మైనర్లని పేర్కొన్నారు.. వాహనం నడుపుతూ దారుణానికి పాల్పడ్డారని చెప్పారు.

మరి మైనర్లు వాహనం నడిపితే వాటి యాజమానులదే బాధ్యతని తెలిపారు. మరి వారిపైన ఎందుకు కేసు నమోదు చేయలేదని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. వాహన యజమానులను ఎందుకు దాస్తున్నారని క్వశ్చన్ చేశారు.