రోలర్ స్కేటింగ్ లో హైదరాబాద్ బాలుడికి సిల్వర్ మెడల్
* చెన్నైలో జరిగిన 61వ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో ప్రతిభ చాటిన విశృత్
హైదరాబాద్: తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరమైన చెన్నైలో 61వ జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మన హైదరాబాద్ నగరానికి చెందిన బాలుడు విశృత్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. నగరంలోని నాగోల్ బండ్లగూడ కృష్ణానగర్ లో నివాసం ఉంటున్న శేరిపల్లి శివప్రసాద్, మాధవి దంపతుల కుమారుడైన విశృత్ 9-11 బాలుర విభాగంలో చెన్నై స్పోర్టిఫై ఎరెనాలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగిన స్పీడ్ ఇన్లైన్ స్కేటింగ్ పోటీల్లో విశేష ప్రతిభను చాటి ద్వితీయ స్థానంలో నిలిచాడు.
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివే విశృత్ గతంలో ఢిల్లీ గురుగామ్ లో జరిగిన జాతీయ పోటీల్లో కూడా సిల్వర్ మెడల్ సాధించాడు. అదే విధంగా భువనగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విశృత్ రెండు గోల్డ్ మెడళ్లను సాధించి విశేష ప్రతిభ చాటాడు. అనేక రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎన్నో పథకాలు సాధించి పలువురి నుంచి ప్రశంశలు పొందాడు. చెన్నైలో జరిగిన 61వ జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించడం తమకెంతో ఆనందం కలిగించిందని విశృత్ తల్లిదండ్రులు శేరిపల్లి శివప్రసాద్, మాధవి దంపతులు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున శిక్షణ ఇప్పిస్తే తమ కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతాడని వారు తెలిపారు. విశృత్ ప్రతిభ చాటడంపై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తోటి విద్యార్థులతో పాటు, బండ్లగూడ కృష్ణానగర్ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.