టీపీసీసీ చీఫ్ నియామకంలో వైఎస్సార్ స్ట్రాటజీ?
* మహేశ్ కుమార్ గౌడ్ నియామకం వెనుక ఆంతర్యం అదే?
రచ్చబండ, హైదరాబాద్: సుదీర్ఘ కసరత్తు తరువాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసిన ఆ పార్టీ అధిష్ఠానం.. ఈ విషయంలో వ్వవహరించిన తీరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెస్తోంది. టీపీసీసీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించడం, నూతన అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను ఏఐసీసీ నియమించడం తెలిసిందే. ఈ పదవి కోసం రాష్ట్ర కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు పోటీ పడినా.. చివరికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న మహేశ్ కుమార్ నే అధిష్టానం ప్రమోట్ చేసింది.
కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యూఐ నేతగా ప్రస్థానం ప్రారంభించిన మహేశ్ కుమార్.. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అధ్యక్రుడి స్థాయికి చేరుకున్నారు. అయితే మహేశ్ కుమార్ గౌడ్ నియామకం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు పూర్తి స్థాయిలో ఉందన్న ప్రచారం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నాటినుంచి పీసీసీ అధ్యక్షుడయ్యే విషయంలో, తీవ్ర పోటీ నడుమ ముఖ్యమంత్రి పదవి దక్కించుకునే విషయంలోనూ ఆయనకు మహేశ్ కుమార్ పూర్తి మద్దతుగా నిలిచారు. రేవంత్ కు వ్యతిరేకంగా ఆనాడు పార్టీలో వ్యతిరేక గళం వినిపించిన వారికి ధీటుగా మహేష్ సమాధానం ఇచ్చారు. దీంతో, తన లక్ష్యాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో రేవంత్ టీపీసీసీ చీఫ్ గా మహేష్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
అధిష్ఠానం కూడా ఇటు సీఎం రేవంత్ ప్రతిపాదనను పరిశీలిస్తూనే.. అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సుదీర్ఘ మంతనాలు సాగించింది. మరోవైపు సామాజిక సమీకరణాలనూ పరిగణనలోకి తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల నుంచి ముగ్గురి పేర్ల పై చర్చలు జరిపింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి సహకారం అందిస్తూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, మిషన్-2028 లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ ఎంపిక ఉండాలని కసరత్తు చేసింది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమ ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశాన్నీ పరిశీలించింది. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో.. పీసీసీ చీఫ్ పదవిని ఉత్తర తెలంగాణ నేతకు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. పైగా రెడ్డి సామాజికవర్గం నేత సీఎంగా ఉన్నందున.. రెడ్డియేతర వ్యక్తినే పార్టీ అధ్యక్షుడిని చేయాలని నిర్ణయించింది. అయితే బీసీ వర్గం నుంచి గతంలోనూ డి.శ్రీనివాస్, కె.కేశవరావు, పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినా.. వారు ముగ్గురూ ఒకే సామాజికవర్గం (మున్నూరుకాపు)నకు చెందినవారే. దీంతో ఈసారి బీసీల్లో మరో బలమైన సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకే గౌడ సామాజికవర్గానికి చెందిన మహేశ్ కుమార్ కు చాన్స్ దక్కింది.
టీపీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన మాట నెగ్గించుకున్నా.. జరిగిన పరిణామాలు మాత్రం గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రోజులను గుర్తుకు తెస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. వైఎస్సార్ సైతం తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ నేతలైన డి.శ్రీనివాస్, కె.కేశవరావును వరుసగా పీసీసీ అధ్యక్షులుగా నియమించేలా చేశారు. పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నా.. తాను సూచించిన వారినే అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టగలిగారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా తనకు విశ్వాసపాత్రుడైన మహేశ్ కుమార్ గౌడ్ ను నియమింపజేసుకున్నారని పార్టీ శ్రేణులు గుర్గుచేస్తున్నాయి.
ఎప్పటికైనా పీసీసీ అధ్యక్షుడిని అవుతా: జగ్గారెడ్డి
టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు చెబుతూనే తన మనసులోని మాటను బయటపెట్టారు. తాను కూడా పీసీసీ చీఫ్ కావాలనుకుంటున్నానని, ఎప్పటికైనా అవుతానని అన్నారు. తెలంగాణలో సీఎం పదవిలో రెడ్డి సామాజికవర్గం నేత ఉండడం వల్లే పీసీసీ చీఫ్ పదవిని బీసీ నేతకు ఇచ్చారని తెలిపారు. భవిష్యత్‌లో రెడ్డిలకు పీసీసీ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే తాను గట్టిగా ప్రయత్నిస్తానని చెప్పారు.