రాకేష్ టికాయత్.. ఢిల్లీలో ఏడాది పాటు జరిగిన మహా రైతు ఉద్యమానికి నేతృత్వం వహించిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) కీలక నేత. పట్టువదలని ఉద్యమంగా అది పేరు గాంచింది. రైతు ఉద్యమ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అయితే నేడు బీకేయూ నుంచి రాకేష్ టికాయత్ తో పాటు బీకేయూ అధ్యక్షుడు, టికాయత్ సోదరుడు నరేష్ టికాయత్ బహిష్కరణకు గురయ్యారు.
ఉద్యమం అనంతరం జరిగిన పరిణామాలపై బీకేయూలో తీవ్ర చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో రాకేష్ టికాయత్, నరేష్ టికాయత్ వైఖరిపై ఇతర కార్యవర్గ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా వైఖరి మారని కారణంగా బీకేయూ కార్యవర్గం వారిద్దరి బహిష్కరణకు నిర్ణయం తీసుకుంది.
రాకేష్ టికాయత్, నరేష్ టికాయత్ సోదరులిద్దరూ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు నడుపుతున్నారని రైతు సంఘం నేతల ప్రధాన ఆరోపణ. కొన్ని రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం వారిద్దరూ పని చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు బీకేయూ నూతన అధ్యక్షుడిగా రాజేష్ సింగ్ చౌహాన్ నియమితులయ్యారు. దీనిపై ఇంతవరకూ రాకేష్ టికాయత్ స్పందించలేదు. అయితే బీకేయూ రెండుగా చీలే అవకాశముందని అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా కేంద్రం ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన దీక్షలో రాకేష్ టికాయత్ పాల్గొనడం గమనార్హం. ఇంకా మరికొన్ని రాజకీయ వేదికలపై ఆయన పాలుపంచుకున్నారని రైతు నేతలు ఆరోపిస్తున్నారు.