* టీఎస్ ఆర్టీసీ సూపర్ వైజర్ పల్లె సుదర్శన్
* త్వరలో ముకుందాపురంలో పౌర సన్మానం
రచ్చబండ, సూర్యాపేట: జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన డాక్టర్ బంటు కృష్ణ మా ఊరైన ముకుందాపురం ఆణిముత్యం అని టీఎస్ ఆర్టీసీ సూపర్ వైజర్ పల్లె సుదర్శన్ కొనియాడారు. జర్నలిజంలో పీహెచ్ డీ చేసి గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా, ఇటీవలే హైకోర్టు అడ్వకేట్ గా నమోదు చేసుకొని మరింత ఎత్తుకు ఎదగడం మాకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. సూర్యాపేటలోని బంటు కృష్ణ నివాసంలో ఆయనను కలిసి శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా పల్లె సుదర్శన్ మాట్లాడుతూ చిన్ననాటి మిత్రుడైన డాక్టర్ బంటు కృష్ణ బాల్యం నుంచే కష్టపడి చదువుకున్నారని తెలిపారు. ఉన్నత చదువులకు వయసు అడ్డు రాదని డాక్టర్ బంటు కృష్ణ నిరూపించారని చెప్పారు. కృష్ణ సతీమణి అనసూయ, తల్లిదండ్రులు బంటు సైదయ్య, బుచ్చమ్మలు ఆయన ఎదుగుదలకు చేదోడు వాదోడుగా నిలిచారని వివరించారు. మూడు దశాబ్దాలకు పైగా కృష్ణ జర్నలిస్టుగా సూర్యాపేట కేంద్రంగా విశేష సేవలందిస్తూ గుర్తింపు పొందారని తెలిపారు. డాక్టర్ బంటు కృష్ణ మరింత ఎత్తుకు ఎదిగి ముకుందాపురం గ్రామానికి, సూర్యాపేట జిల్లాకు మరింత పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరారు. తోటి మిత్రులు, గ్రామస్తులతో చర్చించి త్వరలో ముకుందాపురం గ్రామంలో డాక్టర్ బంటు కృష్ణకు పౌర సన్మానం చేస్తామని సుదర్శన్ వెల్లడించారు.
అనంతరం డాక్టర్ బంటు కృష్ణ మాట్లాడుతూ తన ఎదుగుదలను చూసి అభినందించడానికి వచ్చిన టీఎస్ ఆర్టీసీ సూపర్ వైజర్ పల్లె సుదర్శన్ కు కృతజ్ఞతలు తెలిపారు. చిన్ననాడు కలిసి చదువుకున్న విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎల్లప్పుడూ సుదర్శన ఆశీస్సులు తనకు ఉండాలని కోరుకున్నారు.