* అవార్డులు, రివార్డులు ప్రకటించిన ప్రభుత్వాలు, క్రీడా సంఘాలు
* పలవురు ఒలింపియన్లకు ప్రభుత్వ ఉద్యోగాలు
రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : విశ్వక్రీడలైన ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడాన్ని గొప్ప వరంగా క్రీడాకారులు భావిస్తుంటారు. ఇక ఆ క్రీడల్లో పతకం సాధిస్తే.. దేశవ్యాప్తంగా ప్రశంసలు, కీర్తి ప్రతిష్ఠలతోపాటు ప్రభుత్వాలు, క్రీడా సంఘాలు ఇచ్చే అవార్డులు, రివార్డులు మరింత గొప్పగా ఉంటాయి. తాజాగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు కూడా ఇలాంటి ప్రోత్సాహకాలు గొప్పగానే లభించాయి.
వాస్తవానికి పారిస్ ఒలింపిక్స్ లో ఎన్నో సంచలనాలు, కొన్ని వివాదాలు, మరెన్నో మెరుపులు చోటుచేసుకున్నాయి. ఒలింపిక్స్ లో భారత్ నుంచి పాల్గొన్న అథ్లెట్లు కొన్ని విభాగాల్లో తృటిలో పతకాలు చేజార్చుకున్నప్పటికీ.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారనే చెప్పాలి. మొత్తంగా ఈ ఒలింపిక్స్ లో భారత్ కు ఆరు పతకాలు వచ్చాయి. ఇందులో ఐదు కాంస్య పతకాలు కాగా, మరొకటి రజత పతకం. వాస్తవానికి ఏడో పతకం కచ్చితంగా స్వర్ణం లేదా రజతం వచ్చి ఉండేది. కానీ, అనూహ్యంగా వినేష్ ఫోగాట్ 100 గ్రాముల అధిక బరువు అంశం వివాదం కావడంతో పతకం చేజారింది. ఇక పతకాలు సాధించిన అథ్లెట్లను మన దేశం తగిన విధంగా గౌరవించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నగదు బహుమతులు ప్రకటించి సత్కరించాయి. మరికొన్ని ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చాయి. పతక విజేతలైన వారికి ఎవరెవరిపై ఎంతెంత కాసుల వర్షం కురిసిందనేది పరిశీలిస్తే..
స్వప్నిల్ కుశాలె:
పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో స్వప్నిల్ కాంస్య పతకం సాధించాడు. ఈ విభాగంలో తొలి పతకం సాధించిన భారత్ షూటర్ గా నిలిచాడు. ఈ సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే కోటి రూపాయల నజరానా ప్రకటించారు. సెంట్రల్ రైల్వే స్పెషల్ ఆఫీసర్ గానూ స్వప్నిల్ నియమితులయ్యారు.
మనుబాకర్:
ఒకే ఒలింపిక్స్ లో దేశానికి రెండు పతకాలు తెచ్చిన ఘనత వహించారు మనుబాకర్. 10 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంతో పాటు సరబ్ జ్యోత్ సింగ్ తో కలిసి మిక్స్డ్ ఈవెంట్లోనూ కాంస్యం గెలిచింది. ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ రూ.30 లక్షల రివార్డును ప్రకటించారు.
సరబ్ జ్యోత్ సింగ్:
మనుబాకర్ తో కలిసి 10 మీటర్ల మిక్స్డ్ షూటింగ్ లో సరబ్ జ్యోత్ కాంస్య పతకం అందుకున్నాడు. ఈ సమయంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి రూ.22.5 లక్షల రివార్డును ప్రకటించారు. మరోపక్క హరియాణా ప్రభుత్వం జాబ్ ఆఫర్ ప్రకటించగా.. సరబ్ జ్యోత్ దాన్ని సున్నితంగా తిరస్కరించారు.
పురుషుల హాకీ జట్టు:
పారిస్ ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శనతో భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సమయంలో టీంలోని ఒక్కో సభ్యుడికి రూ.15 లక్షలు, సహాయక సిబ్బంది ఒక్కొక్కరికీ రూ.7.5 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది హాకీ ఇండియా. మరోపక్క డిఫెండర్ అమిత్ రోహిదాస్ కు ఒడిశా ప్రభుత్వం రూ. 4 కోట్లు ప్రకటించి.. ఒక్కో సభ్యుడికి రూ.15 లక్షలు, సపోర్ట్ స్టాఫ్ కు రూ.10 లక్షలు రివార్డ్ ప్రకటించింది. ఇదే సమయంలో.. పంజాబ్ సీఎం భగవంత్ మన్ జట్టు మొత్తానికి రూ. కోటి నగదు బహుమతి ప్రకటించారు.
నీరజ్ చోప్రా:
జావెలిన్ త్రోలో రజత పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాకు పలు సంస్థలు భారీగా రివార్డులు, అవార్డులు అందజేయనున్నట్లు తెలుస్తోంది. 2021 టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించినప్పుడు ప్రభుత్వం అతడికి రూ.6 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది.
అమన్ సెహ్రావత్:
ఈ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో పతకం సాధించిన అమన్ 57 కిలోల విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్నాడు. అయితే ఇతడికి అందించే నగదు బహుమతులు, ఇతర బహుమతులకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.