హైదరాబాద్ సీపీ మార్పు విషయంలో ఆంతర్యమేమిటి?

Kottakota Srinivasa Reddy was replaced by CV Anand as Hyderabad CP after eight months of service

రచ్చబండ, హైదరాబాద్: కొత్తకోటను ఎందుకు మార్చారు? ఆనంద్ ను ఎందుకు తెచ్చారు?
* మూణ్నాళ్ల ముచ్చట వెనుక ఉన్న అసలు నిజాలేంటి?

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ గా ఆయనను ఏరికోరి తెచ్చుకున్నారు. సామాజిక వర్గమో, లేక మరే అంశం పనిచేసిందో తెలియదుగానీ.. అప్పటికే శాంతిభద్రతల నిర్వహణలో సమర్థులుగా నిరూపించుకున్న సీనియర్ ఐపీఎస్ లను కాదని కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నగర పోలీస్ బాస్ గా నియమించారు. హోం మంత్రిత్వ శాఖను కూడా తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి.. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వివక్షకు గురైన శ్రీనివాసరెడ్డిని తాను అందలం ఎక్కించారు. నగర శాంతిభద్రతల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలంటూ కఠినమైన ఆదేశాలే ఇచ్చారు.

కాంగ్రెస్ సర్కారు కొలువుదీరినప్పటి నుంచి ఈ ఎనిమిది నెలల్లో శ్రీనివాసరెడ్డి పనితీరు అంత ఆశాజనకంగా లేదన్న రిపోర్టులు సీఎం రేవంత్ రెడ్డికి అందినట్లు తెలుస్తోంది. నగరంలోనూ ఎన్నో నేరాలు ఈ కాలంలో చోటుచేసుకున్నాయి. ఆ మాటకొస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా పలు నేర, హింసాత్మక ఘటనలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో హోంమంత్రి లేకపోవడం వల్లే పర్యవేక్షణ లోపించిందని, ఈ ఘటనలు అన్నింటికీ హోం మంత్రిత్వ శాఖను తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంతే బాధ్యత వహించాలనే డిమాండ్లు ప్రతిపక్ష పార్టీలతోపాటు వివిధ వర్గాల నుంచి వస్తున్నాయి.

భైంసాలో ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నంతో చోటుచేసుకున్న ఘటనలతో ప్రభుత్వంపై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పలువురు పోలీస్ అధికారులను రేవంత్ సర్కారు బదిలీ చేసింది. ఇందులో భాగంగా నగర సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని కూడా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఒకప్పడు సీపీగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కు మరోసారి ఈ బాధ్యతలను కట్టబెట్టింది. అయితే ఈ నిర్ణయం సంచలనంగా మారింది.

కొత్తకోట శ్రీనివాసరెడ్డి గతంలో రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో జడ్పీటీసీగా ఉన్న తాను.. పలుమార్లు వివిధ ఫిర్యాదులతో శ్రీనివాసరెడ్డిని కలిసేవాడినని, ఇప్పుడు తానే ఆయనను నియమించే స్థాయికి చేరుకున్నానని రేవంత్ రెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో స్వయంగా చెప్పారు. కానీ, శ్రీనివాసరెడ్డి మాత్రం రేవంత్ అంచనాలకు తగ్గట్లుగా పనిచేయలేకపోయారనే అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమయ్యాయి. మరోవైపు నగరంలో గణపతి ఉత్సవాలు మొదలయ్యాయి. త్వరలో గణేశ్ నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు హైడ్రా నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డినే నమ్ముకుంటే తనకు తలనొప్పులు తప్పవన్న అభిప్రాయానికి సీఎం రేవంత్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వీటన్నింటినీ సమర్థంగా నిర్వహించే అధికారికి బాధ్యతలు అప్పగించాలన్ననిర్ణయానికి వచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సీవీ ఆనంద్ అయితేనే ఇందుకు సమర్థుడని భావించి.. ఆయనను సీపీగా మళ్లీ తీసుకొచ్చారు. వాస్తవానికి సీవీ ఆనంద్ పై ఎటువంటి రిమార్కులు లేవు. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున పూర్తి ఫలితాలు రాకముందే డీజీపీ అంజనీకుమార్.. నాటి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి పుష్ఫగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆగ్రహించిన కేంద్ర ఎన్నికల సంఘం అంజనీకుమార్ తో పాటు ఆనాడు నగర కమిషనర్ గా ఉన్న సీవీ ఆనంద్ ను సైతం తప్పించింది. ఆ తరువాత రేవంత్ ప్రభుత్వం కొలువు దీరాక ఆనంద్ ను ఏసీబీ డీజీగా సీఎం రేవంత్ నియమించారు. ఆ బాధ్యతలను సైతం ఆనంద్ సమర్థంగా నిర్వహిస్తూ .. రాష్ట్రంలో పలువురు లంచగొండి ఉద్యోగులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేలా చేశారు. తద్వారా లంచగొండి ఉద్యోగుల పాలిట సింహస్వప్నంలా మారారు.

ఈ నేపథ్యంలోనే ఆయనను తిరిగి హైదరాబాద్ నగర సీపీగా తిరిగి నియమించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, సీపీ బాధ్యతల నుంచి తప్పించిన శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా నియమించారు. ఇక సీవీ ఆనంద్ స్థానంలో ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే మరి కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా ఉంటాయని అంటున్నారు.