హైడ్రా చర్యలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Hydra demolitions in Hyderabad

హైడ్రా చర్యలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
* ఆ ప్రాంతాల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట పడ్డట్టేనా?
* నటుడు మురళీమోహన్ కూ రేవంత్ సర్కారు షాక్
* వారి కట్టడాలకూ మున్ముందు షాక్ తప్పదా?

రచ్చబండ, హైదరాబాద్: హైదరాబాద్ లోని ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువుల కబ్జా నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన హైడ్రా కూల్చివేతలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే విషయం ఇప్పట్లో తేలేలా లేదు. భవిష్యత్ తరాలకు మేలు చేస్తుందనుకుంటే.. మరి కడదాకా కొనసాగుతుందా అనే విషయమూ ప్రశ్నార్థకమే. మరి ఈ దశలో ప్రభుత్వ మదిలో ఏమున్నది. ఎవరిని టార్గెట్ చేసింది అన్నదీ తేలడం లేదు. కొన్నాళ్ళు వ్యతిరేకుల ఆస్తులు, మరికొన్నాళ్లు బడా బాబులు, ఇంకొన్నాళ్ళు సామాన్యులు లక్ష్యంగా దాడులు సాగుతున్నా, అధికార పక్షం వాళ్ళ వైపు కన్నెత్తి చూడటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒవైసీ దరిదాపుల్లోకి వెళ్లి వెనక్కి వచ్చిందని అపవాదు లేకపోలేదు.
సెలెబ్రిటీలకు షాక్ లు!
వరుసగా సెలెబ్రిటీలకు షాకిస్తోంది. ఇప్పటికే సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా నిర్మించారంటూ కూల్చేసిన హైడ్రా.. తాజాగా సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ కు నోటీసులు జారీ చేసింది. తొలుత హైడ్రాకు కూల్చివేసే అధికారాలు మాత్రమే ఉండగా.. తాజాగా ప్రభుత్వం నోటీసులు జారీ చేసే అధికారం కూడా కల్పించడంతో ఆ మేరకు హైడ్రా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్ టీఎల్ తోపాటు, బఫర్ జోన్ లో జయభేరి నిర్మాణాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని నోటీసుల్లో పేర్కొంది. హైడ్రా అధికారుల నోటీసులపై సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు. 33 ఏళ్లుగా తాను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని అన్నారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లుగా గుర్తించామని అధికారులు చెబుతున్నారని తెలిపారు. వీటి కోసం హైడ్రా అధికారులు రావాల్సిన అవసరం లేదని, ఆ షెడ్డును తామే కూల్చేస్తామని స్పష్టం చేశారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. సినీ ప్రముఖుల విషయంలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరు మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు పాలించిన గత ప్రభుత్వాల అధినేతలందరితోనూ సినీ ప్రముఖులు సఖ్యతగా మెలిగారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా పలువురు సినీ పెద్దలు, ప్రముఖ నటులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అయినప్పటికీ.. సినీ ప్రముఖుల ఆస్తులు లక్ష్యంగా హైడ్రా ముందుకు కదలడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు, చెరువులను కాపాడటం ద్వారా హైదరాబాద్ నగరాన్ని వరదలు, ముంపు బారి నుంచి కాపాడేందుకు హైడ్రా ద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది.

ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉండడం, ప్రజల నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతుండడంతో నగరంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై హైడ్రా ఏమాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్ లోని అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తోంది. ఆక్రమణదారులు ఎవరైనా డోంట్ కేర్ అంటూ.. ముందుకెళ్తోంది. ఇప్పటికే 18 ఎకరాల భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. రాజకీయ పార్టీల నేతలకు కూడా నోటీసులు జారీ చేసింది. వీరిలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్, గాయత్రి విద్యాసంస్థలతోపాటు మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన కాలేజీలు ఉన్నాయి. వీరు కోర్టును ఆశ్రయించడంతో ఆ విద్యాసంస్థల కూల్చివేతలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కానీ, మున్ముందు వీరికి కూడా కూల్చివేతల ముప్పు తప్పకపోవచ్చు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించే దిశగా ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే.. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు అడ్డకట్ట పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఆ తర్వాత జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులుక లంచాలు ఇచ్చి నిర్మాణాలకు అనుమతి తీసుకున్నారు. నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు వారికి నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్తున్నారు. తమకు అధికారులే ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారని కోర్టుకు చెబుతున్నారు. అయితే లంచాలు తీసుకుని పర్మిషన్ ఇచ్చిన అధికారులు అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తుంది. అధికారుల తీరు వల్లే చెరువులు కబ్జాకు గురవుతున్నాయని చెబుతున్నారు.