* ఒక్కొక్కరిగా వైసీపీ నేతలపై కేసులు పెడుతున్న కూటమి ప్రభుత్వం
* జోగి రమేశ్ కుమారుడి అరెస్టుతో.. నెక్స్ట్ కొడాలి నానియేనంటూ ప్రచారం
రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి: ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయి ప్రవర్తించిన ఆ పార్టీ నాయకులకు ఇప్పుడు కష్టాలు వచ్చిపడుతున్నాయి. మళ్లీ అధికారంలోకి తామే వస్తామన్న ధీమాతో వైసీపీ నేతలు తప్పు మీద తప్పులు చేశారని, వారి ఇష్టారాజ్యంగా నడుచుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, వారి అంచనాలు తలకిందులైన వైపీసీ అధికారం కోల్పోవడం, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో.. అప్పుడు వారికి కొమ్ము కాసిన పోలీసులే ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కొంప ముంచనున్న వివాదాస్పద వ్యాఖ్యలు
గతంలో టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, ఆయన కుటుంబసభ్యుల పైనా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు కుటుంబం వ్యాఖ్యల అంశాన్ని తెరపైకి తీసుకురాకుండానే.. నాని చేసిన ఇతర కార్యకలాపాలపై నమోదైన కేసుల్లో ఆయనను జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇలా చంద్రబాబుపై నోరు పారేసుకున్న పెడన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగి రమేశ్ విషయంలో వ్యవహరిస్తున్నట్లుగానే కొడాలి నాని విషయంలోనూ ముందుకెళ్లనున్నట్లు తెలుస్తొంది.
కేసినో కేసును తిరగదోడే యత్నం
గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు తన అనుచురులతో కలిసి బాబు ఇంటిపైకి జోగి రమేశ్ దూసుకెళ్లి దాడి చేయడం తెలిసిందే. అయితే ఈ అంశాన్ని ప్రస్తావించకుండా.. అగ్రిగోల్డ్ భూములను జోగి రమేశ్ కుటుంబ సభ్యులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్న కేసుపై ఆయన కుమారుడు జోగి రాజీవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయిన కొడాలి నాని విషయంలోనూ ప్రభుత్వం చర్యలు ఉంటాయని అంటున్నారు. కొడాలి నాని గతంలో ఓ కేసినో నిర్వాహకుడితో కలిసి కేసినో జూదం నిర్వహించారని, ప్రత్యర్థులపై దాడులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై అప్పట్లో పలు కేసులు కూడా నమోదైనా ముందుకు కదలలేదు. కొన్నింటిని మూసేశారని కూడా అంటున్నారు. ఇప్పుడు ఆ కేసులనే పోలీసులు వెలికి తీస్తున్నారని తెలుస్తోంది.
కొడాలిపై తీవ్ర ఆరోపణలు
వాస్తవానికి కొడాలి నానిపై గతంలో టీడీపీ నేతల నుంచి విపరీతమైన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావును కొడాలి అనుచరులు బెదిరించారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇదే క్రమంలో… రంగా వర్ధంతిలో పాల్గొనకూడదంటూ వైసీపీ నేతలు పలుమార్లు బెదిరించినట్లు చెబుతారు. వీటన్నిటికీ పరాకాష్ట అన్నట్లుగా 2022 డిసెంబర్ 25న వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయంపై దాడి చేసి తీవ్రం విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో అప్పటి సీఐ.. వైసీపీ నేతలకు కొమ్ముకాశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా పోలీసులు దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ సేకరించినట్లు తెలుస్తోంది. నాడు ఈ దాడుల్లో.. కొడాలి నాని అనుచరులు, వైసీపీ నేతలు కలిపి సుమారు 22 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ప్రధానంగా ఈ వ్యవహారంలో కొడాలి పాత్రను వెలికితీసే పనిలో ఉన్నారని అంటున్నారు.
ఇక కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై గతంలో తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అయితే నాడు గుడివాడకు వెళ్లిన నిజనిర్ధారణ కమిటీపైనా కొడాలి నాని అనుచరులు, వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇందులో కూడా కొడాలి పాత్రను నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు! ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం వెతుకుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొడాలి నానికీ ఉచ్చు బిగిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.