‘బిగ్ బాస్’ 8వ సీజన్ లో లిమిట్ లేని ఎంటర్ టైన్మెంట్

‘బిగ్ బాస్’ 8వ సీజన్ లో లిమిట్ లేని ఎంటర్ టైన్మెంట్

* త్వరలో బిగ్ బాస్ 8వ సీజన్
* ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రోమో షో

‘బిగ్ బాస్’ రియాలిటీ షో.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు ప్రేక్షకులకు అంతగా చేరువైన రియాలిటీ షో ఇది. ఇప్పటికి ఏడు సీజన్లను విజయవంతంగా, అత్యంత ప్రేక్షకాదరణతో పూర్తి చేసుకున్న ఈ షో.. ఇక 8వ సీజన్ కు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. కాగా, ప్రతిసారీ షో ప్రారంభానికి ముందుగా ప్రోమో విడుదల చేయడం, దాని ద్వారా షోకు హైప్ దక్కేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈసారి షోకు సంబంధించిన న్యూ ప్రోమో గురించి మాత్రం చర్చ బాగా జరుగుతోంది. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో హోస్ట్ నాగార్జున తన మాస్ ఎలిమెంట్ ను మరోసారి చూపించాడు.

అందమైన భామలతో కలిసి ఈ టాలీవుడ్ మన్మథుడు తన సూపర్ స్టెప్పులతో నెక్ట్స్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. ప్రోమోలో కమెడియన్ సత్య ప్రత్యేకమైన గెటప్ లో కనిపించి ఫన్ యాంగిల్ ను పండించారు. “ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ కి, ఫన్ కి, ట్విస్టులకు లిమిట్ లేదంటూ” నాగార్జున చెప్పిన మాటలు సీజన్ పై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించిన ప్రోమోలో, గత సీజన్లకు భిన్నంగా కంటెస్టెంట్స్ పాత్రలు, జరగబోయే డ్రామా, మరియు లవ్ స్టోరీస్ పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన టాస్కులు, గ్రూప్ యాక్షన్స్ తో పాటు, ఎమోషన్స్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ఈ సీజన్ ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది. ఈ ప్రోమో ద్వారా వచ్చే సీజన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఐదు సీజన్లుగా నడిపిస్తున్న నాగార్జున
గత సీజన్లలో నాని మరియు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించినా, చివరి ఐదు సీజన్ల నుండి నాగార్జున ఈ షోని మరింత విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ సారి కూడా కింగ్ నాగ్ మరోసారి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. గత సీజన్లలో నాగార్జున తన సున్నితమైన హాస్యం, ఎంటర్‌టైన్‌మెంట్ స్టైల్ తో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ప్రోమో విడుదల తర్వాత, ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ఫ్యాన్స్ లో కొత్త సీజన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యే ఈ సీజన్, “ఇన్ఫినిటీ ఎంటర్‌టైన్‌మెంట్” పేరుతో ప్రేక్షకులను అలరించనుంది.

ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ పేర్లు కూడా కొన్ని బయటకు వచ్చినప్పటికీ, వాటిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘బిగ్ బాస్’ 8వ సీజన్ కోసం విడుదలైన తాజా ప్రోమో ప్రేక్షకులను, ముఖ్యంగా షో ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సీజన్ కూడా పాత సీజన్ల కంటే మరింత ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ మరియు అనూహ్య ట్విస్టులతో సరికొత్తగా ఉండబోతుందని ప్రోమో ద్వారా అర్థమవుతోంది. షో ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఈ సీజన్ అందించే ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది.

అవకాశం కోసం ఎంతోమంది నిరీక్షణ
బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం కోసం సెలెబ్రిటీల నుంచి సాధారణ వ్యక్తుల దాకా చాలా మంది ఎదురుచూస్తుంటారు. ప్రతి సీజన్ లోనూ ప్రముఖ వ్యక్తలతోపాటు ఒకరిద్దరు సాధారణ వ్యక్తులను కూడా బిగ్ బాస్ షోకు ఎంపిక చేయడమే ఇందుకు కారణం. అంతేకాదు.. బిగ్ బాస్ 7వ సీజన్ లో సాధారణ వ్యక్తి అయిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అంతకుముందు గంగవ్వ లాంటి వారు కూడా ఎంపికయ్యారు. దీంతో ఈసారి పాల్గొన బోయే సాధారణ వ్యక్తలు ఎవరెవరా? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వీరికితోడు వివాదాస్పద వ్యక్తులు కూడా అప్పుడప్పడూ హౌస్ లో దర్శనమిస్తుంటారు.

వేణు స్వామి వస్తున్నారా?
ఈ క్రమంలోనే ఈసారి వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామికి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం వచ్చిందన్న చర్చ నడుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదుగానీ.. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే షోకు ఆయన కుటుంబంపై వివాదాస్పద జ్యోతిష్యం చెప్పే వేణుస్వామి రానున్నారనే ప్రచారం మాత్రం ఆసక్తి రేపుతోంది. నాగార్జున కుమారుడైన నాగచైతన్య, సమంత పెళ్లి నిలవదని, వారు విడిపోతారని గతంలో చెప్పిన వేణుస్వామి.. ఇటీవలే నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం రోజే.. వారికి వ్యతిరేకంగా బహిరంగ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వేణుస్వామి తీరుపై తీవ్ర వ్యతిరేకత రావడం, చివరికి కొందరు సినిమా జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగాయి. మరి తన కుటుంబ వ్యవహారాన్ని ఇంతగా రచ్చెకెక్కిస్తున్న వేణుస్వామిని బిగ్ బాస్లోకి నాగార్జున రానిస్తారా? అన్నది ప్రశ్నార్థకమే.