భూమి ఒకరిది.. రికార్డులో పేరు ఇంకొకరిది!
* ఇది అధికారుల తప్పిదమా.. లేక ధరణి తప్పిదమా?
* న్యాయం చేయాలని పేద మహిళా రైతు వేడుకోలు
* తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఐడేళ్లుగా ప్రదక్షిణలు
రచ్చబండ, శంకర్ పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి వ్యవస్థను రెవెన్యూలో తీసుకొస్తే రైతులకు న్యాయం జరుగుతుందనుకున్నారు. కానీ కొందరికి అన్యాయమే జరుగుతున్నది. ఇది రెవెన్యూ అధికారి తప్పిదమా? లేక ధరణి వ్యవస్థ మాయాజాలమా అని తెలియక ఓ పేద మహిళా రైతు ఆవేదనకు గురవుతున్నది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామానికి చెందిన దివంగత వాగు రాములుకు గ్రామ శివారులో సర్వే నెంబర్ 12 64/Eలో నాలుగు ఎకరాల 8 గంటల భూమి ఉంది.
కాగా ఏడు సంవత్సరాలు క్రితం ప్రభుత్వం రైతులకు తమ భూముల రికార్డులలో తమ పేర్లే ఉండాలని మంచి ఉద్దేశంతో ధరణి వ్యవస్థ తీసుకువస్తే ఆ ధరణిలో వాగు రాములు భూమి శంకర్ పల్లి మండలంలోని రావులపల్లి గ్రామానికి చెందిన మరొకరి పేరుణ నమోదయింది. దీంతో వాగు రాములు భార్య వసంత ఇబ్బందుల పాలవుతున్నారు. ఐదు సంవత్సరాల క్రితమే తమ భూమి ఇతరుల పేర రికార్డు అయిందని దాన్ని సరిచేయాలని తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
కాగా ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు పేరును ధరణిలో సవరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం కూడా వసంత స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ధరణిలో తమ భూమిపై ఇతరుల పేరు ఉందని దానిని తొలగించాలని ఫిర్యాదు ఫిర్యాదు చేశారు. సదరు భూమిని ఆ వ్యక్తి విక్రయించడానికి స్లాట్ బుక్ చేశారని ఆమె తెలిపారు. కాగా గత ఐదేండ్ల క్రితమే మహాలింగాపురం గ్రామానికి వచ్చి ఎమ్మారై విచారణ జరిపారని చెప్పారు.
ఇప్పటివరకు తమభూమి ఇతరుల పేరు రెవెన్యూ అధికారులు తొలగించకపోవడం శోచనీయమన్నారు. గతంలో తాను ఫిర్యాదు చేసినప్పుడు అప్పుడు తాసిల్దార్ గా ఉన్న సైదులు తమకు న్యాయం చేస్తామని అక్రమంగా నమోదైన పేరు తొలగించి వాగు రాములు పేరున రికార్డులు ఎక్కిస్తామని చెప్పారని వసంత తెలిపారు. అయినా ఇప్పటివరకు ఆయన పేరును తొలగించడం లేదని, సదరు వ్యక్తి తన భూమిని విక్రయించడానికి మళ్లీ స్లాట్ ను బుక్ చేశారని చెప్పారు. స్థానిక తహసిల్దార్ తమ భూమిని ఇతరుల పేరు రిజిస్టర్ చేయొద్దని ఆమె వేడుకుంటున్నారు.