ఆన్ లైన్లో అమ్మపై దాష్టీకం

• ఆన్ లై(లో)న్ లీలలు ఇంతింత కాదయా!
మధిర : ఆన్ లైన్ లోన్ యాప్ ల మోసాలు నగరాలనే కాదు మామూలు పట్టణాలకూ వ్యాపించాయి. వాటి భారిన పడి నలిగిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఖమ్మం జిల్లా మధిరలో జరిగిన ఓ సంఘటన ఆన్ లైన్ మోసాలకు పరాకాష్టగా నిలిచింది.

మధిర పట్టణానికి చెందిన ఓ యువకుడు ఆన్లైన్ డుట్టా రుణ యాప్ భారిన పడ్డాడు. తీవ్ర యాతన పడిన అనంతరం అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయం గురించి ఆయన తెలిపిన విషయాలు దిమ్మతిరిగేలా ఉన్నాయి.

నువ్వు తీసుకున్న అప్పు ఇంకా తీరలేదు. ఇంకా చెల్లించాలి. లేకపోతే మీ అమ్మ ఫొటోను మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేస్తాం.. అంటూ డుట్టా రూపీ లోన్ యాప్ నిర్వాహకులు నిరంతరం వేధింపులకు గురి చేస్తున్నారని ఆ యువకుడు వివరించారు.

డుట్టా రూపీ లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తీసుకున్న సమయంలో తన ఆధార్ కార్డుతో పాటుగా తన తల్లి పాన్ కార్డును ప్రూఫ్ గా ఇచ్చినట్లు వివరించారు. తీసుకున్న లోను డబ్బులు గడువులోగా తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తే యాప్ వెబ్ సెట్ పని చేయలేదన్నారు.

దీంతో లోన్ నిర్వాహకులకు ఫోన్ చేస్తే యూపీఐ ద్వారా పేమెంటు చేయాలంటూ లింకు పంపినట్లు బాధితుడు తెలిపాడు. వారు పంపిన ఆ యూపీఐకు లోన్ మొత్తం చెల్లించానని వివరించారు.

తర్వాత రుణ బకాయి ఇంకా ఉందంటూ వేధింపులు ప్రారంభించారని వాపోయాడు. తన తల్లి పాన్ కార్డును మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురిచేయడంతో పాటు తన ఫోన్ కాంటాక్ట్స్ ఆధారంగా ఆమె ఒక ఫ్రాడ్ అంటూ సందేశాలు పంపడం ప్రారంభించారన్నాడు.

తాను తీసుకున్న లోనుకంటే అదనంగా చెల్లించినా వారి వేధింపులు మాత్రం ఆపడం లేదని ఆ యువకుడు ఆవేదన చెందాడు. దీనిపై మధిర టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

డుట్టా రూపీ లోన్ యాప్ పై ఫిర్యాదు వచ్చింది.. దీనిపై విచారణ చేస్తున్నాం.. అని మధిర పట్టణ పోలీసులు తెలిపారు. ఇలాంటి దారుణాలు ఆపకపోతే మితిమీరి మరిన్ని ఆగడాలు జరిగే ప్రమాదముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.