ఎండు మిర్చి @ రూ.52 వేలు

• ఎనుమాముల మార్కెట్ లో రికార్డు ధర
• పసిడిని మించి ధర పలికిన వైనం
• మిర్చి రైతు కళ్ళల్లో ఆనందం

మిర్చి క్వింటా ధర తులం బంగారం ధరను మించిపోయింది. తులం బంగారం రూ.50వేలు ఉంటే.. క్వింటా దేశీయ మిర్చి ఎనుమాముల మర్కెట్లో తాజాగా రూ.52 వేలు పలికింది. ఇది దేశంలోనే రికార్డ్ ధర. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ధరను చూసి అమ్మకానికి వచ్చిన రైతులు ఆనందం తాండవంలో మునిగిపోయారు.

వరంగల్ బ్యూరో : మిర్చి రైతులకు తీపి కబురందింది. మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ధర పలకడంతో రైతులు ఖుషీగా ఉన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ లో గురువారం దేశీయ మిర్చికి రూ.52 వేల ధర పలికింది. దీంతో ఇక్కడే విక్రయించేందుకు పెద్ద ఎత్తున రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ధర అధికంగా ఉన్న చోటుకే తమ పంటలను తరలించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల రైతులు తరలివస్తున్నారు.

తులం బంగారాన్ని మించిన ధర

ఎండు మిర్చి ఎనుమాముల మార్కెట్లో బంగారం ధరను మించిపోయింది. దేశంలోనే కొత్త రికార్డు ధరను నమోదు చేసింది. పసిడి ధరను మించిపోయింది. తులం బంగారం ధర రూ.50వేలు ఉంటే.. క్వింటా దేశీయ మిర్చి రూ.52 వేలకు చేరుకుంది. ఇది దేశంలోనే రికార్డ్ ధర. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ధరను చూసి రైతులు మురిసిపోతున్నారు.

గత కొన్నాళ్లుగా ధరల పెరుగుదల

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇటీవల రికార్డు ధరలు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు క్వింటా రూ.50 వేలు ఉన్న క్వింటా మిర్చి ధర గురువారం ఒక్కసారిగా రూ.52 వేలు పలికింది. ఇది దేశీయ మార్కెట్ చరిత్రలోనే ఆల్ టైం రికార్డు అని రైతులు, వ్యాపారులు అంటున్నారు.

పంటను మార్కెట్కు తీసుకొస్తున్న రైతులు ధరలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పొలాల్లో ఉత్పత్తి తక్కువగా వచ్చినా.. ఈ రికార్డు ధరలను చూస్తున్న అన్నదాత కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది.

తెల్ల బంగారానికీ రికార్డు ధర

మిర్చితో పాటు తెల్లబంగారంగా పిలుచుకునే పత్తికి సైతం ఎనుమాముల మార్కెట్ లో రికార్డు ధరలు పలుకుతున్నాయి. పత్తికి ఆల్ టైం రికార్డ్ ధర పలుకుతోంది. క్వింటా పత్తి ధర రూ.11 వేలు దాటింది. గురువారం ఏకంగా క్వింటా పత్తి ధర ఏకంగా రూ.11,200 చేరి ధగధగ మెరిసింది.

పక్కనున్న మహారాష్ట్రలోని ధర్మాబాద్ మార్కెట్లో 12 వేలు పలికిందని సమాచారం. రోజురోజుకూ పత్తి ధరలు పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. ఈ సీజన్లో తక్కువ దిగుబడి రావడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఇదిలా ఉండగా పత్తి రైతులు ఎక్కువ మంది సీజన్ మొదట్లోనే తక్కువ ధరకు తమ సరుకును అమ్ముకున్నారు. దీంతో నేడు ధర పెరగడంతో వారంతా దిగులు చెందుతున్నారు.