భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ఆఖరి మాటలు?

యుక్త వయసులో దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన నిజమైన దేశభక్తులు వారు. దేశ దాస్య శృంఖలాలు తెంచి, ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చాలన్న సంకల్పంతో ముందుకు సాగిన ఆ వీరులు తమ ప్రాణాలనే బలి ఇవ్వాల్సి వచ్చింది. అయినా ప్రాణాలొదిలేటప్పడు తమ దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా, దేశం కోసమే నినదిస్తూ తుదిశ్వాస విడిచిన ఆ వీరులే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్. సరిగ్గా 91 ఏండ్ల క్రితం ఇదేరోజు జరిగిన ఆ వీరుల ఉరితీతకు ముందు అన్న మాటలు వింటే ఎవరికైనా రక్తం ఉప్పొంగక మానదు.

అసలు ఏం జరిగింది?
ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వంపై భారతదేశంలో జాతీయోద్యమం ఉధృతంగా సాగుతున్నాయి. భగత్ సింగ్ తన అనుచరులతో కలిసి దేశ స్వాతంత్ర్య కాంక్షతో ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నాడు. అప్పటి జాతీయ నేత లాలా లజపతిరాయ్ ను పోలీసులు ఓ సంఘటనలో కొట్టారు. దానికి ప్రతీకారంగా లాహోర్ ఎస్పీపై భగత్ సింగ్ అతని అనుచరులు కాల్పులు జరిపారు. అయితే ఆ కాల్పుల్లో ఎస్పీ బదులు అదనపు ఎస్పీ శాండర్స్ మరణించారు. అనంతరం వారు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

ఎలా దొరికారు?
అయితే కొద్దికాలానికే ప్రభుత్వాన్ని భయపెట్టడానికి భగత్ సింగ్ అనుచరులు అప్పటి ఢిల్లీ అసెంబ్లీలో తక్కువ గాఢత కలిగిన బాంబు విసిరారు. దీంతో అక్కడ దొరికిపోయారు. ఈ కేసుకు తోడుగా శాండర్స్ కేసును అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం తిరగదోడింది. విచారణలో భాగంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు మరణశిక్ష విధించింది.

చివరి కోరిక ఏమిటో తెలుసా?
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ముగ్గురిని అప్పటి న్యాయస్థానంలో చివరి కోరిక ఏమిటని అడిగారు. వారేం సమాధానమిచ్చారో తెలుసా. తమను సాధారణ నేరస్థులుగా తాడుకు కట్టి ఉరితీయొద్దని, రాజకీయ ఖైదీలం కాబట్టి నేరుగా తుపాకీతో కాల్చి చంపండని ముగ్గురూ కోరారు. అయితే ఆంగ్లేయ సర్కారు వారి కోరికను నిరాకరించింది.

12 గంటల ముందే మరణశిక్ష అమలు
దేశభక్తులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను 1931 మార్చి 24న ఉదయం ఉరితీయాలని అప్పటి న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే ఈ విషయం తెలిసి దేశం యావత్తు ఉద్విగ్నంగా మారింది. దేశమంతా ఉద్రిక్తంగా మారే అవకాశముందని భావించిన ఆంగ్లేయ సర్కారు ఒకరోజు ముందు మార్చి 23న రాత్రి 7.30 కే శిక్షను అమలు చేయాలని భావించింది.

ఉరితాళ్లను ముద్దాడిన యోధులు
లాహోర్ సెంట్రల్ జైలులోని మైదానంలోకి వారు ముగ్గురినీ తీసుకొచ్చారు. వారిని చూసిన కొందరు భారతీయ పోలీసుల కళ్ల నుంచి కన్నీటి సుడులు తిరిగాయి. కానీ భగత్ సింగ్ లో మాత్రం ఏమాత్రం ఆందోళన కానరాలేదు.

వారు ముగ్గురూ ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న వారిలా ధైర్యంగా కనిపించారు. మధ్యలో భగత్ సింగ్ ఉండగా, ఎడమ వైపున సుఖ్ దేవ్, కుడివైపున రాజ్ గురును నిలిపి ఉంచారు. ఈ సమయంలో ఆ వీర యోధులు వారికెదురుగా ఉన్న ఉరితాళ్లను ముద్దాడారు.

ముగ్గురు వీరుల చివరి మాటలివే..
బలిపీఠంపైకి ఎక్కిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ఉరితాళ్లను ముద్దాడి మెడలకు వేసుకున్నారు. ఈ ఉద్విగ్నభరిత సమయంలో వారు అన్న మాటలు ప్రతీ ఒక్కరిలో రక్తం ఉరకలెత్తిస్తుంది.

‘‘దిల్ సే నిక్ లేగీ న మర్ కర్ ఖీ వతన్ కీ ఉల్ఫత్.. మేరీ మిట్టీ సే బీ ఖుష్బూ వతన్ ఆయేగీ’ (మరణించినా మాలో దేశభక్తి మిగిలే ఉంటుంది. మట్టిలో కలిసిపోయాక కూడా అందులోంచి మాతృభూమి గుభాళింపే వస్తుంది) అని 23ఏళ్ల భగత్ సింగ్ ఎలుగెత్తి చాటగానే.. మిగతా ఇద్దరూ గళం కలిపారు. అలా ఆ వీరులు దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు.